యూఎస్‌ మార్కెట్లకు ట్రేడ్‌ రిలీఫ్‌

యూఎస్‌ మార్కెట్లకు ట్రేడ్‌ రిలీఫ్‌

ఉన్నట్టుండి ట్రంప్‌ ప్రభుత్వం చైనా దిగుమతులపై విధించదలచిన అదనపు టారిఫ్‌లను ఆలస్యం చేయనున్నట్లు ప్రకటించింది. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, వీడియో గేములు, బొమ్మలు, మానిటర్లు తదితర పలు ప్రొడక్టులను టారిఫ్‌ల జాబితా నుంచి తప్పిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో రెండు రోజులుగా భారీ అమ్మకాలతో కుదేలైన అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. మంగళవారం డోజోన్స్‌ 373 పాయింట్లు(1.5 శాతం) జంప్‌చేసి 26,280 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 42 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 2,926 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 153 పాయింట్లు(2 శాతం) పురోగమించి 8,016 వద్ద స్థిరపడింది. 

ధరల జోరు
అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న పరిస్థితులలో దశాబ్ద కాలం తదుపరి తిరిగి ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న ఆందోళనలు వరుసగా రెండో రోజు సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. అమెరికా వాణిజ్యాధికారులతో చైనా వాణిజ్య మంత్రి లియూ ఫోన్లో సంభాషించాక ట్రంప్‌ ప్రభుత్వం తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 15వరకూ అదనపు టారిఫ్‌ల విధింపును వాయిదా వేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. జులైలో రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 2.2 శాతం ఎగసింది. ఇది కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ లక్ష్యం 2 శాతానికంటే అధికంకాగా.. గత ఆరు నెలల్లోనే గరిష్టస్థాయిలో ధరలు పెరగడం విశేషం!

Image result for viacom and cbs

యాపిల్‌ దన్ను
ప్రధానంగా చైనీస్‌ ఎలక్ట్రానిక్‌ ప్రొడక్టులపై టారిఫ్‌లను వాయిదా వేయడంతో లబ్ది పొందనున్న ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా యాపిల్‌ షేరు 4.2 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌, స్పోర్ట్‌వేర్‌ దిగ్గజం నైక్‌ 2 శాతం చొప్పున పుంజుకోగా.. బొమ్మల తయారీ సంస్థలు హాస్‌బ్రో ఇంక్‌ 2.7 శాతం, మ్యాటెల్‌ ఇంక్‌ 4.6 శాతం చొప్పున ఎగశాయి. మరోవైపు విలీన వార్తల నేపథ్యంలో వయాకామ్‌ 2.4 శాతం, సీబీఎస్‌ కార్ప్‌ 1.4 శాతం చొప్పున లాభపడ్డాయి.
 
ఆసియా ప్లస్
మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లు బలపడ్డాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే 1-0.4 శాతం మధ్య లాభపడ్డాయి. ఇక ఆసియాలోనూ సానుకూల ట్రెండ్‌ నెలకొంది. తైవాన్‌, థాయ్‌లాండ్‌, చైనా, కొరియా, ఇండొనేసియా, హాంకాంగ్‌, జపాన్‌ 1.2-0.6 శాతం మధ్య పెరిగాయి. సింగపూర్‌ సైతం 0.25 శాతం లాభంతో ట్రేడవుతోంది. కాగా.. 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ స్వల్పంగా పుంజుకుని 1.69 శాతానికి చేరాయి. డాలరు ఇండెక్స్‌ 97.78ను తాకగా.. యెన్‌ 106.45కు బలహీనపడింది. యూరో 1.117 వద్ద స్థిరంగా కదులుతోంది.