ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప లాభంతో 10,923 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. రెండు రోజుల భారీ నష్టాల నుంచి మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. మరోపక్క ప్రపంచ ఆర్థిక మాంద్య భయాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఉన్నట్టుండి పతనమయ్యాయి. దీంతో నేడు దేశీయంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నదని, ఫలితంగా మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

చివర్లో భారీ పతనం
దశాబ్ద కాలం తరువాత మళ్లీ ఆర్థిక మాంద్య ఆందోళనలు తలెత్తడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు దెబ్బతగిలింది. అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనుకావడంతో సోమవారం అమెరికా మార్కెట్లు పతనంకాగా.. ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో మంగళవారం పేరుకు మాత్రమే లాభాలతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే నష్టాలలోకి ప్రవేశించాయి. మిడ్‌సెషన్‌ తదుపరి అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరికి మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్‌ 624 పాయింట్లు కోల్పోయి 36,958 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 184 పాయింట్లు పతనమై 10,926 వద్ద ముగిసింది. తద్వారా సెన్సెక్స్‌ 37,000.. నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌ దిగువన స్థిరపడ్డాయి. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,836 పాయింట్ల వద్ద, తదుపరి 10,747 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,081 పాయింట్ల వద్ద, తదుపరి 11,235 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,489, 27,249 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,164, 28,599 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
సోమవారం బక్రీద్‌ సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. మంగళవారం నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 638 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మాత్రం రూ. 201 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. గత శుక్రవారం ఎఫ్‌పీఐలు రూటు మార్చి రూ. 204 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ సైతం రూ. 607 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.