ISGEC హెవీ- బాష్‌.. ప్చ్‌ క్యూ1 

ISGEC హెవీ- బాష్‌.. ప్చ్‌ క్యూ1 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ ISGEC హెవీ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే విధంగా.. ప్రస్తుత ఏడాది(2019-20) క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నిరాశాపూరిత పనితీరు ప్రదర్శించడంతో డైవర్సిఫైడ్‌ గ్లోబల్‌ దిగ్గజం బాష్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం నష్టాలతో డీలా పడింది. ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లలోనూ అమ్మకాలకు దిగడంతో నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

ఐఎస్‌జీఈసీ హెవీ ఇంజినీరింగ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో ఐఎస్‌జీఈసీ హెవీ ఇంజినీరింగ్‌ నికర లాభం 40 శాతం క్షీణించి రూ. 28 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 29 శాతం పెరిగి రూ. 1944 కోట్లను అధిగమించింది. కంపెనీ ప్రధానంగా ప్లాంట్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ, మెకానికల్‌, హైడ్రాలిక్‌ ప్రెస్సెస్‌, అలాయ్‌ స్టీల్‌, ఫెర్రస్‌ క్యాస్టింగ్స్‌ తదితరాలను తయారు చేస్తుంటుంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐఎస్‌జీఈసీ హెవీ ఇంజినీరింగ్‌ షేరు 4.4 శాతం పతనమై రూ. 349 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 335 వరకూ దిగజారింది. తద్వారా 52 వారాల కనిష్టానికి చేరువైంది. ఈ కౌంటర్లో గత రెండు వారాల ట్రేడింగ్‌ సగటు పరిమాణం 8,800 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 6900 షేర్లు చేతులు మారాయి.

Image result for bosch ltd

బాష్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో బాష్‌ లిమిటెడ్‌ నికర లాభం 35 శాతం క్షీణించి రూ. 280 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 13 శాతం తక్కువగా రూ. 2779 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 23 శాతం నీరసించి రూ. 483 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 19.6 శాతం నుంచి 17.4 శాతానికి బలహీనపడ్డాయి. ప్రస్తుత త్రైమాసికంలో రూ. 82 కోట్ల అనూహ్య నష్టం నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో బాష్‌ లిమిటెడ్‌ షేరు 3.4 శాతం పతనమై రూ. 13,800 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 13,700 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది.



Most Popular