లుమాక్స్‌ ఆటో- ఫ్యూచర్‌.. జోరు

లుమాక్స్‌ ఆటో- ఫ్యూచర్‌.. జోరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ ఆటో విడిభాగాల కంపెనీ లుమాక్స్‌ ఆటో టెక్నాలజీస్‌  లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. కాగా.. మరోపక్క ఈ ఏడాది(2019-20) క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో పనితీరు అంచనాలను చేడంతో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

లుమాక్స్‌ ఆటో టెక్నాలజీస్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో లుమాక్స్‌ ఆటో టెక్నాలజీస్‌ నికర లాభం 25 శాతం నీరసించి రూ. 11.5 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 3 శాతం పుంజుకుని రూ. 287 కోట్లను తాకింది. నిర్వహణ లాభం సైతం 11 శాతం క్షీణించి రూ. 24.5 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 9.9 శాతం నుంచి 8.5 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో లుమాక్స్‌ ఆటో టెక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 87 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 89 వరకూ ఎగసింది.

Image result for future enterprises ltd

ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ నికర నష్టం రూ. 21 కోట్ల నుంచి రూ. 10.5 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం పుంజుకుని రూ. 1415 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 27 శాతం పెరిగి రూ. 384 కోట్లను అధిగమించింది. ఇబిటా మార్జిన్లు 22.5 శాతం నుంచి 27.2 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 28 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.