దివీస్‌ విలవిల- గొదావరి 'పవర్‌

దివీస్‌ విలవిల- గొదావరి 'పవర్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో హెల్త్‌కేర్‌ రంగ హైదరాబాద్‌ కంపెనీ దివీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఏడాది(2019-20) క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో పనితీరు అంచనాలను చేడంతో గొదావరి పవర్‌ అండ్‌ ఇస్పాత్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఫలితంగా దివీస్‌ లేబ్‌ కౌంటర్‌ అమ్మకాలతో కళతప్పగా.. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో గొదావరి పవర్‌ కౌంటర్‌ బలపడింది. వివరాలు చూద్దాం..

దివీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో దివీస్‌ లేబొరేటరీస్‌ నికర లాభం స్వల్పంగా 2 శాతమే పెరిగి రూ. 272 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 17 శాతం వృద్ధితో రూ. 1163 కోట్లను తాకింది. నిర్వహణ లాభం సైతం 10 శాతం పెరిగి రూ. 387 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 35.4 శాతం నుంచి 33.3 శాతానికి నీరసించాయి. ఫలితాల నేపథ్యంలో దివీస్‌ లేబ్‌ కౌంటర్‌ డీలా పడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7 శాతం పతనమై రూ. 1548 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1512 వరకూ తిరొగమించింది.

Related image

గొదావరి పవర్‌ అండ్‌ ఇస్పాత్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో గొదావరి పవర్‌ అండ్‌ ఇస్పాత్‌ నికర లాభం నామమాత్ర క్షీణతతో రూ. 57 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 16 శాతం పుంజుకుని రూ. 833 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 5 శాతం నీరసించి రూ. 174 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 25.5 శాతం నుంచి 20.9 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం గొదావరి పవర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం లాభపడి రూ. 175 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 190 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకడం గమనార్హం.