గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ కేక- ప్రీమియర్‌ పతనం

గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ కేక- ప్రీమియర్‌ పతనం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో పొగాకు ఉత్పత్తుల కంపెనీ గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కౌంటర్‌ హైజంప్‌ చేసింది. కాగా.. మరోపక్క ఈ ఏడాది(2019-20) క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో  డిఫెన్స్‌ రంగంలో వినియోగించే సోలిడ్‌ ప్రొపెల్లంట్స్‌ తయారీ సంస్థ ప్రీమియర్‌ఎక్స్‌ప్లోజివ్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా ఈ కౌంటర్‌ నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..

గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల కంపెనీ గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా నికర లాభం 106 శాతం దూసుకెళ్లి రూ. 119 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 40 శాతం వృద్ధితో రూ. 841 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం సైతం రెట్టింపునకుపైగా పెరిగి రూ. 201 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 16.5 శాతం నుంచి 23.9 శాతానికి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ కౌంటర్లో కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరువయ్యారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 142 లాభపడి రూ. 851 వద్ద ఫ్రీజయ్యింది.

Image result for premier explosives

ప్రీమియర్‌ఎక్స్‌ప్లోజివ్స్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో ఎనర్జీ మెటీరియల్స్ సంస్థ ప్రీమియర్‌ఎక్స్‌ప్లోజివ్స్‌ నికర లాభం 6 శాతం క్షీణించి రూ. 0.7 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం నీరసించి రూ. 53 కోట్లను తాకింది. కాగా.. ఎయిర్‌టార్గెట్‌ ఇనీసియేటర్‌ సరఫరాకు రక్షణ శాఖ నుంచి తాజాగా రూ. 13.5 కోట్ల ఆర్డర్‌ లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం పతనమై రూ. 164 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 160 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.