వారెవ్వా.. ఆర్‌ఐఎల్‌ దూకుడు

వారెవ్వా.. ఆర్‌ఐఎల్‌ దూకుడు

42వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో చైర్మన్‌, ఎండీ ముకేశ్‌ అంబానీ.. కంపెనీ సాధించిన మైలురాళ్లు, భవిష్యత్‌ ప్రణాళికలు వెల్లడించిన నేపథ్యంలో డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్ పతన మార్కెట్లోనూ దూకుడు చూపుతోంది. వెరసి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేరు 6 శాతం జంప్‌చేసింది. రూ. 1233 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఈ కౌంటర్‌కు మరింత డిమాండ్ పెరిగింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 1286 వద్ద ట్రేడవుతోంది. గత దశాబ్ద కాలంలోనే ఇది అత్యధిక లాభంకావడం విశేషం!

ఏజీఎం హైలైట్స్‌
డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఆర్‌ఐఎల్‌లో సౌదీ అరామ్‌కో 20 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు నాన్‌బైండింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్‌ విలువ 75 బిలియన్‌ డాలర్లు. వివిధ బిజినెస్‌లలో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ చేపట్టనుంది. తద్వారా కంపెనీ రానున్న ఏడాదిన్నర కాలంలో రుణరహితంగా ఆవిర్భవించే ప్రణాళికల్లో ఉంది. మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలపడం ద్వారా టెలికం యూనిట్‌ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కొత్త క్లౌడ్‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. సెప్టెంబర్‌ 5 నుంచి జియో గిగాఫైబర్‌ సర్వీసులను ప్రారంభించనున్నట్లు గ్రూప్‌ చైర్మన్‌ ముకేశ్‌ పేర్కొన్నారు. 100 ఎంబీ కనీస వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌, ఉచిత కాల్స్‌, టీవీ సేవలు తదితరాలను నెలకు రూ. 700కే అందించనున్నట్లు వివరించారు. ఇంధన రిటైలింగ్‌ నెట్‌వర్క్‌లో 49 శాతం వాటాను బ్రిటిష్‌ దిగ్గజం బీపీ పీఎల్‌సీ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 7,000 కోట్లు వెచ్చించనుంది.