దశాబ్ద కాలం తదుపరి తిరిగి ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న ఆందోళనలు వరుసగా రెండో రోజు అమెరికా స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో సోమవారం డోజోన్స్ 391 పాయింట్లు(1.5 శాతం) పతనమై 25,896 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 36 పాయింట్లు(1.25 శాతం) క్షీణించి 2,883 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 96 పాయింట్లు(1.2 శాతం) కోల్పోయి 7,863 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా రెండో రోజు మార్కెట్లు భారీగా నీరసించాయి. ఏడాది కాలంగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తున్న సంకేతాలు వెలువడుతున్న కారణంగా ఇన్వెస్టర్లు బంగారం తదితర రక్షణాత్మక పెట్టుబడులవైపు దృష్టిసారిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తద్వారా స్టాక్స్‌లో అమ్మకాలు ఊపందుకుంటున్నట్లు తెలియజేశారు.
ఇతర కారణాలూ
గ్లోబల్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా అమెరికా, చైనా వివాదాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయనున్నట్లు అంచనా వేసింది. మరోపక్క రెండు నెలలుగా ఎక్స్ట్రాడిషన్స్పై చైనా తీసుకువస్తున్న బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్‌లో కనిపిస్తున్న నిరసనలు తాజాగా వెల్లువెత్తాయి. కాగా.. అర్జెంటీనా అధ్యక్షుడు మాక్రి ఎన్నికలలో పరాభవం చెందడంతో ఆ దేశ కరెన్సీ పెసో ఉన్నట్టుండి పతనమైంది. డాలరుతో మారకంలో 55.85ను తాకింది. ఈ నేపథ్యంలో బంగారం, బాండ్లు, జపనీస్ కరెన్సీ యెన్ వంటి రక్షణాత్మక పెట్టుబడులవైపు మరోసారి ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శించారు. 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ 2016 అక్టోబర్ తరువాత మళ్లీ 1.595 శాతానికి నీరసించగా.. యెన్ 105.37కు బలపడింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో అమ్మకాలు చేపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆసియా వీక్
ఇటలీ అధికార రాజకీయ కూటమిలో విభేదాల కారణంగా వరుసగా రెండో రోజు సోమవారం యూరోపియన్ మార్కెట్లు డీలా పడ్డాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే 0.15-0.4 శాతం మధ్య క్షీణించాయి. ఇక ఆసియాలోనూ ట్రెండ్ బలహీనంగా కనిపిస్తోంది. హాంకాంగ్, జపాన్, సింగపూర్, తైవాన్, చైనా, కొరియా, థాయ్‌లాండ్, ఇండొనేసియా 1.6-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి.
కోచ్ స్కిడ్
కోచ్ బ్రాండ్ కంపెనీ టాపెస్ట్రీ ఇంక్ 4 శాతం, వెర్సేస్ బ్రాండ్ కంపెనీ క్యాప్రి 4.5 శాతం చొప్పున పతనమయ్యాయి. తమ పాలనలో ఉన్న హాంకాంగ్, మకావూలను ప్రత్యేక దేశాలుగా చూపుతూ ఈ కంపెనీలు టీ షర్ట్‌లను విక్రయిస్తున్నాయంటూ చైనీస్ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడం ప్రభావాన్ని చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. మీడియా కంపెనీలు సీబీఎస్ కార్ప్, వయాకామ్ మధ్య షేర్ల మార్పిడి ద్వారా విలీనమయ్యే అంశం తుది దశకు చేరుకున్నట్లు వెలువడ్డ వార్తలు వయాకామ్ను దెబ్బతీశాయి. ఈ షేరు 5 శాతం క్షీణించింది. కాగా.. నెట్‌ఫ్లిక్స్ ప్రత్యర్థి సంస్థ స్ట్రిమింగ్ సర్వీసుల రోకు ఇంక్ 7 శాతం జంప్‌చేసింది. రేటింగ్ అప్‌గ్రేడ్ దీనికి కారణంకాగా.. ఎన్‌బ్రెల్ ఔషధ పేటెంట్ల తీర్పు నేపథ్యంలో బయోఫార్మా దిగ్గజం అమ్జెన్ ఇంక్ 5 శాతం ఎగసింది.