లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌?

లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌?

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 11,127 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. గత వారం చివరి  రెండు రోజుల్లో దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. సోమవారం బక్రీద్‌ సందర్భంగా దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. అమెరికా స్టాక్‌ మార్కెట్లకు మరోసారి అమ్మకాల సెగ తగిలింది. దీంతో వరుసగా రెండో రోజు భారీగా నష్టపోయాయి. దీంతో నేడు దేశీయంగా ఒడిదొడుకులు నమోదయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

లాభాలతో ఖుషీ
వరుసగా రెండో రోజు శుక్రవారం(9న) హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ ఖుషీగా ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌ 255 పాయింట్లు పెరిగి 37,582 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 11,110 వద్ద ముగిసింది. మిడ్‌సెషన్‌లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా జంప్‌చేయగా.. నిఫ్టీ సైతం 140 పాయింట్లు పురోగమించింది. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,807ను అధిగమించగా.. నిఫ్టీ 11,181ను దాటింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,898 పాయింట్ల వద్ద, తదుపరి 10,999 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,173 పాయింట్ల వద్ద, తదుపరి 11,237 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 28,255, 28,075 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,606, 28,780 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల యూటర్న్‌
దాదాపు నెల రోజులుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యం ఇస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) శుక్రవారం రూటు మార్చి రూ. 204 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. కాగా.. కొద్ది రోజులుగా పెట్టుబడులకే  కట్టుబడుతున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం నగదు విభాగంలో రూ. 607 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. అయితే గురువారం(8న) ఎఫ్‌పీఐలు రూ. 437 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 291 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.