ట్రేడ్‌ వార్‌ ఎఫెక్ట్‌- చల్లబడ్డ చమురు

ట్రేడ్‌ వార్‌ ఎఫెక్ట్‌- చల్లబడ్డ చమురు

అంతర్జాతీయ మార్కెట్లలో గడిచిన వారం ముడిచమురు ధరలు రోలర్‌కోస్టర్‌ రైడ్‌ను తలపించాయి. ఇందుకు పలు అంశాలు ప్రభావం చూపాయి. తొలిగా చైనా దిగుమతులపై అదనపు టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించడం ద్వారా అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ మరోసారి వాణిజ్య వివాదాలను రాజేశారు. దీంతో సోమవారం చమురు ధరలు పతనమయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయవచ్చన్న ఆందోళనలకుతోడు అమెరికాలో ఇంధన నిల్వలు పెరగడంతో బుధవారం తిరిగి భారీగా తిరోగమించాయి. వెరసి లండన్‌లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 56 డాలర్లకు చేరగా.. న్యూయార్క్‌లో నైమెక్స్ చమురు 51 డాలర్లకు నీరసించింది. అయితే ఉత్పత్తి తగ్గింపుపై ఒపెక్‌ దేశాల సంసిద్ధత, యూరోపియన్‌ నిల్వలు తగ్గడం, చమురు ఫ్యూచర్స్‌లో షార్ట్‌ కవరింగ్ వంటి అంశాలతో చివరి రెండు రోజులూ ధరలు రికవర్‌ అయ్యాయి. శుక్రవారం 2-4 శాతం మధ్య ధరలు పుంజుకున్నాయి. వెరసి గత వారం బ్రెంట్‌ బ్యారల్‌ నికరంగా 5 శాతంపైగా క్షీణించింది. 58.53 డాలర్ల వద్ద ముగిసింది. ఇక నైమెక్స్‌ 54.50 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన గరిష్టాల నుంచి చూస్తే చమురు ధరలు 20 శాతంవరకూ క్షీణించడం గమనార్హం!

Related image

డిమాండ్‌ డీలా
ఈ ఏడాది(2019) తొలి అర్ధభాగంలో చమురుకు డిమాండ్‌ తగ్గినట్లు అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(IEA) తాజాగా పేర్కొంది. ఈ కాలంలో చమురు డిమాండ్‌ రోజుకి 5.2 లక్షల బ్యారళ్లమేర మాత్రమే పెరిగినట్లు ఐఈఏ వెల్లడించింది. ఇది 2008లో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం తదుపరి అత్యల్పంకాగా.. ఇందుకు ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించడం కారణమైనట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు  ప్రభావాన్ని చూపినట్లు పేర్కొంటున్నాయి. అయితే చైనా నుంచి అత్యధిక స్థాయిలో రోజుకి 5 లక్షల బ్యారళ్లకు డిమాండ్‌ కనిపించగా.. అమెరికా నుంచి రోజుకి లక్ష బ్యారళ్లకు మాత్రమే డిమాండ్‌ నమోదైనట్లు ఐఈఏ పేర్కొంది.

రెండేళ్లపాటు..
ఈ ఏడాది చమురు డిమాండ్‌ రోజుకి 1.1 మిలియన్‌ బ్యారళ్లు మాత్రమే పెరగనున్నట్లు ఐఈఏ తాజాగా అంచనా వేసింది. ఈ బాటలో 2020లో రోజుకి 1.3 మిలియన్‌ బ్యారళ్ల అదనపు చమురుకు మాత్రమే డిమాండ్‌ పుట్టవచ్చని అభిప్రాయపడింది. గతేడాది(2018)తో పోలిస్తే మే నెలలో రోజుకి 1.6 లక్షల బ్యారళ్లమేర డిమాండ్‌ క్షీణించినట్లు తెలియజేసింది. కాగా.. ఒపెక్‌ దేశాలు, రష్యా తదితన నాన్‌ఒపెక్‌ దేశాల ఉత్పత్తి నియంత్రణలు, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు తదితర అంశాలు చమురు ధరలకు మద్దతును అందించగలవని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.