ఈ వారం మార్కెట్ల దారెటు?!

ఈ వారం మార్కెట్ల దారెటు?!

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా మూడు అంశాలు ప్రభావితం చేసే అవకాశముంది. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(20169-20) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ బాటలో మరికొన్ని పీఎస్‌యూ, బ్లూచిప్‌ కంపెనీలు ఈ వారం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌) పనితీరు వెల్లడించనున్నాయి. వీటితోపాటు స్థూల ఆర్థిక గణాంకాలు విడుదల కానున్నాయి. ఇవికాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి సారించనున్నట్లు చెబుతున్నారు.

జాబితా ఇదీ
ప్రభుత్వ రంగ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ 10న, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ 13న ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇదే విధంగా హెల్త్‌కేర్‌ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్‌ 13న, ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ 14న పనితీరు వెల్లడించనున్నాయి. 

Image result for retail Inflation

ధరల తీరు
జూన్‌ నెలలో పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) మూడు నెలల కనిష్టానికి నీరసించాయి. వెరసి ఐఐపీ వృద్ధి 2 శాతానికే పరిమితమైది. మే నెలలో 7 నెలల గరిష్టం 4.5 శాతానికి చేరింది. ప్రధానంగా తయారీ రంగ మందగించడం ప్రభావం చూపినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. శుక్రవారం(9న) మార్కెట్లు ముగిశాక ఈ గణాంకాలు విడుదలయ్యాయి. ఈ బాటలో జులై నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు 12న వెల్లడికానున్నాయి. ఇదే విధంగా టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలను ప్రభుత్వం 14న ప్రకటించనుంది. జూన్‌లో సీపీఐ 3.18 శాతంగా నమోదుకాగా.. డబ్ల్యూపీఐ 2 శాతానికి నీరసించింది. ఇది 23 నెలల కనిష్టంకావడం గమనార్హం!

Image result for trade war

ఇతర అంశాలూ కీలకం
అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల దేశీ స్టాక్స్‌లో నిరవధిక అమ్మకాలు చేపడుతున్న ఎఫ్‌పీఐల పెట్టుబడులకూ ప్రాధాన్యమున్నట్లు తెలియజేశాయి.
 
ట్రేడింగ్‌ 3 రోజులే
ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ మూడు రోజులకే పరిమితంకానుంది. బక్రీద్‌ సందర్భంగా 12న(సోమవారం) స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సెలవు ప్రకటించారు. ఇదే విధంగా స్వతంత్ర దినోత్సవం(ఇండిపెండెన్స్‌ డే) సందర్భంగా 15న(గురువారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ మంగళ, బుధ, శుక్రవారాలకే పరిమితంకానుంది.