ఈ వారం ట్రేడింగ్ 3 రోజులే

ఈ వారం ట్రేడింగ్ 3 రోజులే

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ మూడు రోజులకే పరిమితంకానుంది. బక్రీద్‌ సందర్భంగా 12న(సోమవారం) స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సెలవు ప్రకటించారు. ఇదే విధంగా స్వతంత్ర దినోత్సవం(ఇండిపెండెన్స్‌ డే) సందర్భంగా 15న(గురువారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ మంగళ, బుధ, శుక్రవారాలకే పరిమితంకానుంది. ఫలితంగా ఈ వారం మార్కెట్లలో యాక్టివిటీ తక్కువగా నమోదయ్యే అవకాశమన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. గత వారం అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడంతో తొలి మూడు రోజులూ ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనమైన విషయం విదితమే. చివర్లో రిలీఫ్‌ ర్యాలీ వచ్చినప్పటికీ అంతర్గతంగా సెంటిమెంటు బలహీనంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌పీఐలు, అధిక సంపన్న వర్గాలపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నును ఉపసంహరించే వీలున్నట్లు వెలువడిన వార్తలు దేశీయంగా ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు.