లాభాలతో రెండో రోజూ ఖుషీ

లాభాలతో రెండో రోజూ ఖుషీ

ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో రెండో రోజూ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ఖుషీగా ముగిశాయి. సెన్సెక్స్‌ 255 పాయింట్లు పెరిగి 37,582 వద్ద నిలవగా.. నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 11,110 వద్ద స్థిరపడింది. మిడ్‌సెషన్‌లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా జంప్‌చేయగా.. నిఫ్టీ సైతం 140 పాయింట్లు పురోగమించింది. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,807ను అధిగమించగా.. నిఫ్టీ 11,181ను దాటింది. కాగా.. నిరుద్యోగిత తగ్గడం, టెక్నాలజీ కౌంటర్లకు డిమాండ్‌ వంటి అంశాలతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. ఈ ప్రభావంతో ఆసియాలోనూ సానుకూల ధోరణి నెలకొంది. దీంతో సెంటిమెంటు బలపడి దేశీయంగానూ మార్కెట్లు హుషారుగా ప్రారంభమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. 

మెటల్‌, ఫార్మా డీలా
ఎన్‌ఎస్‌ఈలో ఆటో 2 శాతం లాభపడగా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ 1.2-0.8 శాతం మధ్య బలపడ్డాయి. అయితే, మెటల్‌, మీడియా, ఫార్మా 0.9-0.5 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 15 శాతం జంప్‌చేయగా.. ఐషర్, టైటన్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, వేదాంతా, హెచ్‌యూఎల్‌, కొటక్‌ మహీంద్రా 5-2 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో యస్ బ్యాంక్‌ 8 శాతం పతనంకాగా.. సిప్లా, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, కోల్ ఇండియా, టాటా స్టీల్‌, జీ, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ 3.7-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

ఫైనాన్స్‌ స్టాక్స్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో మదర్‌సన్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌,  ఉజ్జీవన్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, జస్ట్‌ డయల్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 9-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా మరోవైపు.. ఎన్‌బీసీసీ 12.5 శాతం కుప్పకూలగా.. మహానగర్‌ గ్యాస్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ఐడియా, ఎన్‌సీసీ, అమరరాజా, బీహెచ్‌ఈఎల్‌ 5-2.5 శాతం మధ్య పతనమయ్యాయి.

మిడ్‌, స్మాల్‌ గుడ్‌
మార్కెట్లు హుషారుగా ముగిసిన నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లకు డిమాండ్‌ కనిపించింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-1 శాతం చొప్పున బలపడ్డాయి. మొత్తం 1543 షేర్లు లాభపడగా.. 953 మాత్రమే నష్టాలతో నిలిచాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం దాదాపు రూ. 384 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం తిరిగి రూ. 437 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే బుధవారం రూ. 531 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) గురువారం మరోసారి రూ. 291 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.