ఎంఆర్‌ఎఫ్‌ స్పీడ్‌- హిందాల్కో డౌన్‌

ఎంఆర్‌ఎఫ్‌ స్పీడ్‌- హిందాల్కో డౌన్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో టైర్ల తయారీ దేశీ దిగ్గజం ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఎంఆర్‌ఎఫ్‌ లాభాలతో సందడి చేస్తోంటే.. హిందాల్కో షేరు నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ నికర లాభం 2 శాతం పుంజుకుని రూ. 273 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం పెరిగి రూ. 4471 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 5 శాతం ఎగసి రూ. 612 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 15.1 శాతం నుంచి 13.7 శాతానికి బలహీనడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4.6 శాతం జంప్‌చేసి రూ. 57,200 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 57,431 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

Image result for hindalco industries ltd

హిందాల్కో ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో అల్యూమినియం దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 1063 కోట్లకు పరిమితమైంది. ప్రపంచ మందగమనం, కమోడిటీ ధరల క్షీణత ప్రభావం చూపగా.. మొత్తం ఆదాయం సైతం 4 శాతం నీరసించి రూ. 29,972 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 13 శాతం వెనకడుగుతో రూ. 3,769 కోట్లయ్యింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. నోవెలిస్‌ నికర లాభం 26 శాతం ఎగసి 14.5 కోట్ల డాలర్లకు చేరగా.. నిర్వహణ లాభం 11 శాతం పుంజుకుని 37.2 కోట్ల డాలర్లను తాకింది. ఆదాయం మాత్రం 6 శాతం తక్కువగా 290 కోట్ల డాలర్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో హిందాల్కో ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 3.2 శాతం నష్టంతో రూ. 175 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 173 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.