బంగారం సరికొత్త రికార్డ్‌

బంగారం సరికొత్త రికార్డ్‌

ఓవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు.. విదేశీ మార్కెట్లో బంగారం ధరలకు ఊపునివ్వగా.. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి పతనం ఇందుకు మరింత సహకరించింది. దీంతో దేశీ మార్కెట్లో గురువారం ఒక దశలో పసిడి సరికొత్త రికార్డును సాధించింది. 10 గ్రాముల ధర రూ. 550 ఎగసింది. తద్వారా రూ. 38,470ను తాకడం ద్వారా బంగారం ధర చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో వెండి సైతం కేజీ ధర రూ. 44,000 మార్క్‌ను అధిగమించడం గమనార్హం! రూ. 630 పెరిగి రూ. 44,300కు చేరింది. ఇందుకు ఆరేళ్ల తరువాత మళ్లీ న్యూయార్క్‌ కామెక్స్‌లో పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) ధర 1500 డాలర్లను దాటడం కారణమైంది. ఇదే సమయంలో రూపాయి విలువ 71 సమీపానికి నీరసించింది. అయితే తదుపరి గురువారం ధరలు పతనమైనప్పటికీ తిరిగి ప్రస్తుతం జోరందుకున్నాయి. వివరాలు చూద్దాం..

ఎందుకంటే..
ఏడాది కాలంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య వివాదాలు మరింత ముదిరాయి. ఇది కరెన్సీ వార్‌కు సైతం తెరతీసింది. దీంతో ఇప్పటికే మందమన సంకేతాలు కనిపిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకోవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. ఫలితంగా ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు, కేంద్ర బ్యాంకులూ బంగారంలో కొనుగోళ్లకు ఎగబడ్డాయి. సంక్షోభ సమయాలలో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్ పెరిగే సంగతి తెలిసిందే. ఈ ఏడాది రెండో క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రపంచ కేంద్ర బ్యాంకులు సంయుక్తంగా 224 టన్నులకుపైగా పసిడిని కొనుగోలు చేసినట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. దీంతో ఈ ఏడాది తొలి అర్ధభాగం(జనవరి-జూన్‌)లో 374 టన్నుల పసిడిని సెంట్రల్‌ బ్యాంకులు సొంతం చేసుకున్నట్లయ్యిందని పేర్కొంది. ఇది 2000 తదుపరి అత్యధికమని తెలియజేసింది. ఇక దేశీయంగా జులైకల్లా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల విలువ రూ. 5,080 కోట్లుగా నమోదైంది.

యువాన్‌ దెబ్బ
డాలరుతో మారకంలో చైనా కరెన్సీ యువాన్‌ విలువ 11 ఏళ్ల తదుపరి 7.12కు పతనంకావడం పరిస్థితులను దిగజార్చినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2008 ఏప్రిల్‌ తదుపరి యువాన్‌ 7 స్థాయికి చేరడం మళ్లీ ఇప్పుడే. కాగా.. పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్ చైనా యువాన్‌ విలువను వరుసగా రెండో రోజు 7 వద్దే స్థిరపరచడం ప్రస్తావించదగ్గ అంశం. దీంతో చైనా ఎగుమతులు చౌకకానుండగా.. అమెరికన్ వస్తువులు వ్యయభరితం కానున్నాయి. ఇది మరోసారి వాణిజ్య అసమతుల్యతలకు దారితీస్తుందన్న ఆందోళనలు పెరిగినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కరెన్సీ మ్యానిప్యులేటర్‌గా చైనాను విమర్శిస్తూ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు కూడా.

లాభాల్లోనే
తాజాగా న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ బంగారం డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ 0.6 శాతం ఎగసి 1518 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం 2013లో మాత్రమే ఔన్స్‌ పసిడి 1500 డాలర్లను అధిగమించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధర 17 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! కాగా.. ప్రస్తుతం స్పాట్‌ మార్కెట్లోనూ పసిడి ఔన్స్‌ 0.4 శాతం లాభపడి 1507 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి సెప్టెంబర్ ఫ్యూచర్స్‌ ఔన్స్‌ 0.2 శాతం బలపడి 17.13 డాలర్ల వద్ద కదులుతోంది. 

దేశీయంగా..
విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మెరుస్తుండటంతో దేశీయంగానూ ఈ ప్రభావం కనిపిస్తోంది. అయితే రెండు రోజులుగా డాలరుతో మారకంలో 71 స్థాయి నుంచి రూపాయి కోలుకోవడం కొంతమేర ఉపశమనాన్ని కల్పిస్తున్నట్లు బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల పసిడి రూ. 129 లాభపడి రూ. 37,886ను తాకింది. ఇక వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్‌ రూ. 319 ఎగసి రూ. 43,386 వద్ద ట్రేడవుతోంది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');