ఎండ్యూరెన్స్‌ జూమ్‌- పేజ్‌ పతనం

ఎండ్యూరెన్స్‌ జూమ్‌- పేజ్‌ పతనం

టైర్ల తయారీలోకి ప్రవేశించాలన్న ప్రణాళికలను ఉపసంహరించుకున్నట్లు తాజాగా వెల్లడించడంతో ఆటో విడిభాగాల దిగ్గజం ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు జోష్‌ వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కౌంటర్‌ భారీ లాభాలతో కళకళలాడుతోంది. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఇన్నర్‌వేర్‌ దుస్తుల కంపెనీ పేజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా ఈ కౌంటర్‌ నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..

ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌
ముందురోజు అంతా అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరువుకావడంతో 20 శాతం కుప్పకూలిన ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 12 శాతం దూసుకెళ్లి రూ. 832 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 864 వరకూ జంప్‌చేసింది. కాగా.. ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగాలకు అవసరమయ్యే టైర్ల తయారీలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు వేసినట్లు వెల్లడించడంతో గురువారం ఈ కౌంటర్‌ ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆటో విడిభాగాల కంపెనీ ఎండ్యూరెన్స్‌ షేరు 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 742 వద్ద ముగిసింది.  

Image result for page industries

పేజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్‌)లో జాకీ బ్రాండ్‌ కంపెనీ పేజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 111 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 840 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం నామమాత్ర వెనకడుగుతో రూ. 187 కోట్లకు చేరింది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు షేరుకి రూ. 51 డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. ఇందుకు ఆగస్ట్‌ 20 రికార్డ్‌ డేట్‌గా తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో పేజ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం పతనమై రూ. 17,609 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 17,449 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.