టేక్‌.. ఖుషీ- ఈ షేర్లు బేర్‌

టేక్‌.. ఖుషీ- ఈ షేర్లు బేర్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ టేక్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క ఉన్నట్టుండి కొన్ని ఎంపిక చేసిన మిడ్‌ క్యాప్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. ఫలితంగా టేక్‌ సొల్యూషన్స్‌ లాభాలతో కళకళలాడుతుంటే.. ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఐటీఐ లిమిటెడ్‌ భారీ నష్టాలతో డీలా పడ్డాయి. వివరాలు చూద్దాం..

Image result for take solutions ltd

టేక్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఐటీ సేవల కంపెనీ టేక్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 45 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 9 శాతం పెరిగి రూ. 583 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 35 శాతం పుంజుకుని రూ. 109 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టేక్‌ సొల్యూషన్స్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 106 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 109 వద్ద గరిష్టాన్ని తాకింది. 

నేలచూపుతో...
ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌: ట్రేడింగ్‌ చివరి సెషన్‌లో అంతా అమ్మేవాళ్లేతప్ప కొనుగోలుదారులు కరువుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం కుప్పకూలింది. రూ. 186 కోల్పోయి రూ. 742 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1200 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 1.7 లక్షల షేర్లు చేతులు మారాయి.

రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8.5 శాతం పడిపోయి రూ. 47 దిగువకు చేరింది. ఒక దశలో రూ. 44 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 34.5 లక్షలు షేర్లుకాగా.. ఇప్పటివరకూ 32 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఐటీఐ లిమిటెడ్‌: ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7.5 శాతం పతనమై రూ. 75 వద్దకు చేరింది. తొలుత రూ. 74 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 70,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 72,000 షేర్లు చేతులు మారాయి.