అల్ట్రాటెక్‌, జేఎస్‌పీఎల్‌- నేలచూపు

అల్ట్రాటెక్‌, జేఎస్‌పీఎల్‌- నేలచూపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ విశ్లేషకుల అంచనాలను చేరకపోవడంతో ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క రుణ చెల్లింపులలో విఫలంకాలేదంటూ కంపెనీ ఎండీ వీఆర్‌ శర్మ స్పష్టం చేసినప్పటికీ మెటల్‌ రంగ దిగ్గజం జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో సైతం ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం..

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రయివేట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికర లాభం రెట్టింపై రూ. 1208 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర అమ్మకాలు సైతం 15 పెరిగి రూ. 10,027 కోట్లను తాకాయి. నిర్వహణ లాభం 61 శాతం జంప్‌చేసి రూ. 2,840 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 19 శాతం నుంచి 26 శాతానికి ఎగశాయి. సెంచురీ టెక్స్‌టైల్స్‌ సిమెంట్ యూనిట్‌ను విలీనం చేసుకోవడంతోపాటు విస్తరణ పూర్తయితే సిమెంట్‌ తయారీ మొత్తం సామర్ధ్యం 117.35 మిలియన్‌ టన్నులను తాకనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేరు 2.6 శాతం క్షీణించి రూ. 4229 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4128 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. 

Image result for jindal steel and power ltd

జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌
రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వెలువడుతున్న వార్తలు పూర్తిగా నిరాధారమని జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ స్పష్టం చేసింది. తనఖాలో ఉంచిన షేర్లను రుణదాతలు విక్రయించారన్న వదంతులు నమ్మవద్దని కంపెనీ ఎండీ వీఆర్‌ శర్మ పేర్కొన్నారు. ఈ ఏడాది కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు సాధించనున్నట్లు అంచనా వేశారు. రూ. 300 కోట్ల విలువైన ఎన్‌సీడీలను గడువుకు ముందే చెల్లించినట్లు తెలియజేశారు. బిజినెస్‌ యథాప్రకారం కొనసాగుతున్నదని, తగినంత లిక్విడిటీని సాధిస్తున్నదని వివరించారు. అయినప్పటికీ ఈ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జిందాల్‌ స్టీల్‌ షేరు 3 శాతం క్షీణించి రూ. 99 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 95 దిగువన 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది.