కమిన్స్‌ పతనం- అబాట్‌ జూమ్‌

కమిన్స్‌ పతనం- అబాట్‌ జూమ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో ఇంజిన్లు, జనరేటర్ల తయారీ గ్లోబల్‌ దిగ్గజం కమిన్స్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఫార్మా రంగ గ్లోబల్‌ దిగ్గజం అబాట్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి కమిన్స్‌ ఇండియా  నష్టాలతో కళతప్పగా.. అబాట్‌ ఇండియా లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

కమిన్స్‌ ఇండియా
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రయివేట్ రంగ దిగ్గజం కమిన్స్‌ ఇండియా లిమిటెడ్‌ 17 శాతం తక్కువగా రూ. 152 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ. 1316 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 30 శాతం క్షీణించి రూ. 152 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు దాదాపు 5 శాతం పతనమై 11.2 శాతానికి చేరాయి. ఈ ఏడాదిలో ఎగుమతుల ఆదాయం 10-15 శాతం క్షీణించే వీలున్నట్లు కంపెనీ తాజాగా అంచనా వేసింది. తొలుత 0-5 శాతం క్షీణతనే ఊహించింది. కాగా.. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కమిన్స్‌ ఇండియా షేరు 8 శాతం పతనమై రూ. 602 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 587 వద్ద 5 ఏళ్ల కనిష్టాన్ని చవిచూసింది. ఇంతక్రితం 2014 మేలో మాత్రమే ఈ స్థాయిలో ట్రేడయ్యింది.

Image result for abbott india ltd

అబాట్‌ ఇండియా 
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ దిగ్గజం అబాట్‌ ఇండియా లిమిటెడ్‌ నికర లాభం 41 శాతం ఎగసి రూ. 117 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 18 శాతం పెరిగి రూ. 999 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 56 శాతం పుంజుకుని రూ. 174 కోట్లను అధిగమించింది. ఇబిటా మార్జిన్లు 13.2 శాతం నుంచి 17.4 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అబాట్‌ ఇండియా షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 8,925 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 8945 వద్ద గరిష్టాన్ని తాకింది.