పసిడి మిలమిల.. ఎందుకంటే?!

పసిడి మిలమిల.. ఎందుకంటే?!

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన రెండు దేశాల మధ్య వాణిజ్య పోరు బంగారానికి లబ్ది చేకూరుస్తోంది. కొన్ని నెలలుగా సాగుతున్న అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ఇటీవల ముదరడంతో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్‌ను పెంచుతోంది. దీంతో తాజాగా న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ 1.2 శాతం ఎగసింది. 1502 డాలర్లను తాకింది. ఇంతక్రితం 2013లో మాత్రమే ఔన్స్‌ పసిడి 1500 డాలర్లను అధిగమించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధర 17 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! కాగా.. ప్రస్తుతం స్పాట్‌ మార్కెట్లోనూ పసిడి ఔన్స్‌ 1483 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి సెప్టెంబర్ ఫ్యూచర్స్‌ ఔన్స్‌ 2.2 శాతం జంప్‌చేసి 16.08 డాలర్లకు చేరింది. 

మందగమన ఎఫెక్ట్‌
ఎడతెరిపిలేకుండా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు కొనసాగుతుండటంతో ఇటీవల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో అమెరికా కేంద్ర బ్యాంకు ఉన్నట్టుండి వడ్డీ రేట్ల పెంపు బాటను వీడి తగ్గించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత పాలసీ సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌.. ఫండ్స్‌ రేట్లలో 0.25 శాతం కోత పెట్టింది. దీంతో 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ వెనకడుగు వేశాయి కూడా. ఈ బాటలో ఇప్పటికే యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు(ఈసీబీ) సైతం సహాయక ప్యాకేజీలవైపు మొగ్గు చూపవలసిన పరిస్థితులు తలెత్తుతున్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలుకి ఆసక్తి చూపుతూ వస్తున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 

కరెన్సీ వార్‌
వాణిజ్య వివాద పరిష్కారానికి రెండు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి డీల్‌ కుదరకపోవడంతో గత వారం అమెరికన్‌ ప్రెసిడెంట్ ట్రంప్‌ చైనా దిగుమతులపై 10 శాతం టారిఫ్‌ల విధింపునకు తెరతీశారు. దీంతో చైనా ప్రభుత్వం సైతం అమెరికా నుంచి వ్యవసాయోత్పత్తుల దిగుమతులను నిలిపివేయడంతోపాటు అదనపు సుంకాలను విధించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఉన్నట్టుండి డాలరుతో మారకంలో యువాన్‌ విలువ 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో చైనా ప్రభుత్వం కరెన్సీ మ్యానిప్యులేషన్‌ చేస్తున్నదంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. యువాన్‌ 7.12 శాతానికి నీరసించడంతో చైనీస్‌ ఉత్పత్తులు చౌకకావడంతోపాటు.. అమెరికన్‌ దిగుమతులు వ్యయభరితంగా మారనున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. ఫలితంగా ఇది రెండు దేశాల మధ్య కరెన్సీ వార్‌కు దారితీయనున్నట్లు విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేశారు. అయితే పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా తాజాగా యువాన్‌ మారకపు విలువను 7 దిగువకు సవరించడం ద్వారా కొంతమేర ఆందోళనలు ఉపశమించేందుకు దోహదం చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.

దేశీయంగా..
విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మెరుస్తుండటంతో దేశీయంగానూ ఈ ప్రభావం కనిపిస్తోంది. దీనికితోడు డాలరుతో మారకంలో రూపాయి 71 సమీపానికి బలహీనపడటం కూడా ధరలకు రెక్కలిస్తున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల పసిడి రూ. 174 లాభపడి రూ. 37,671ను తాకింది. ఇక వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్‌ రూ. 531 ఎగసి రూ. 43,018 వద్ద ట్రేడవుతోంది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');