రూపాయి డీలా- 71 వైపు చూపు

రూపాయి డీలా- 71 వైపు చూపు

రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ బలహీనంగా ప్రారంభమైంది.  వరుసగా నాలుగు రోజులపాటు నష్టపోయిన రూపాయి మరోసారి నేలచూపులతో కదులుతోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 8 పైసలు తక్కువగా 70.89 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో మారకంలో మంగళవారం సైతం 8 పైసలు నీరసించి 70.81 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 70.89 వద్ద కనిష్టాన్నీ, 70.47 వద్ద గరిష్టాన్నీ తాకింది. 

భారీ పతనం
అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, డాలరుతో మారకంలో చైనీస్‌ కరెన్సీ యువాన్‌ 11 ఏళ్ల కనిష్టానికి చేరడం వంటి అంశాల నేపథ్యంలో సోమవారం రూపాయి ఏకంగా 113 పైసలు పడిపోయింది. గత ఆరేళ్లలోనే ఇది అత్యధిక(1.6 శాతం) నష్టంకాగా.. చివరికి నాలుగు నెలల కనిష్టం 70.73 వద్ద స్థిరపడింది. ఇంతక్రితం 2013 ఆగస్ట్‌లో మాత్రమే ఈ స్థాయిలో రూపాయి తిరోగమించింది. ఫలితంగా మూడు రోజుల్లోనే రూపాయి 194 పైసల విలువను కోల్పోయింది. కాగా.. శుక్రవారం(2న) సైతం డాలరుతో మారకంలో రూపాయి భారీగా 54 పైసలు క్షీణించింది. 69.60 వద్ద ముగిసింది.  
 
ట్రేడ్‌ భయాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల అమెరికా, చైనా మధ్య తాజాగా చెలరేగిన వాణిజ్య వివాదాలు అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంటును దెబ్బకొట్టినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో ఈక్విటీలు, కరెన్సీలు బలహీనపడగా.. బంగారానికి డిమాండ్‌ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. మరోపక్క రక్షణాత్మక కరెన్సీగా భావించే జపనీస్‌ యెన్‌ బలపడుతుంటే.. రూపాయి నీరసిస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు పసిడి, ముడిచమురు ధరలు సైతం కారణమవుతున్నట్లు తెలియజేశారు. దీనికితోడు గత కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతుండటం కూడా ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.