నేటి నుంచి స్టెర్లింగ్‌&విల్సన్‌ ఐపీవో

నేటి నుంచి స్టెర్లింగ్‌&విల్సన్‌ ఐపీవో

సౌర విద్యుత్‌ రంగంలో ఈపీసీ సొల్యూషన్లు అందించే స్టెర్లింగ్ అండ్‌ విల్సన్‌ సోలార్‌ లిమిటెడ్‌(SWSL) పబ్లిక్‌ ఇష్యూ నేటి(6) నుంచి ప్రారంభమైంది. గురువారం(8న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 775-780 కాగా.. తద్వారా కంపెనీ రూ. 3125 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ రూ. 2083 కోట్లు, ఖుర్షీద్ యాజీ డరువాలా రూ. 1042 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 19 ఈక్విటీ షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువకు మించకుండా ఒకే లాట్‌లో  దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు చూద్దాం..

విదేశాలలోనూ  పాగా
సోలార్‌ పవర్‌ రంగంలో స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌..ఎండ్‌టూ ఎండ్‌ ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులలో కొంతమేర రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీపేర్కొంది. కంపెనీ 26 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ వివరాల ప్రకారం మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలతోపాటు.. దేశీయంగా సోలార్‌ ఈపీసీ సొల్యూషన్స్‌ విభాగంలో అతిపెద్ద సంస్థగా కంపెనీ నిలుస్తోంది. థర్డ్‌పార్టీలు నిర్మించే సోలార్‌ ప్రాజెక్టులకు సైతం కంపెనీ నిర్వహణ, మెయింటెనెన్స్‌(O&M) సర్వీసులనూ సమకూరుస్తోంది. ఈ ఏడాది మార్చికల్లా 6870 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ప్రారంభించింది. ప్రస్తుత ఆర్డర్‌బుక్‌ విలువ రూ. 3831 కోట్లను తాకింది.