అమెరికా మార్కెట్లు.. లబోదిబో

అమెరికా మార్కెట్లు.. లబోదిబో

అమెరికా నుంచి వ్యవసాయోత్పత్తుల దిగుమతులను నిలిపివేయనున్నట్లు చైనా వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా అమెరికన్‌ దిగుమతులపై అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సోమవారం అమెరికా మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు దిగుమతి సుంకాల హెచ్చరికలు పంపిన ప్రెసిడెంట్‌ ట్రంప్‌నకు చైనా ప్రభుత్వం మార్కెట్లు ముగిశాక.. తమ కరెన్సీ యువాన్‌ ద్వారా మరో షాకిచ్చింది. పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా యువాన్‌ మారకపు విలువను బలహీనపరచడం ద్వారా చైనా దిగుమతులను చౌక చేసింది. మరోవైపు అమెరికా ఎగుమతులు వ్యయ భరితంకానున్నాయి. దీంతో నేడు(మంగళవారం) కూడా మార్కెట్లు పతనంకానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు సంకేతంగా ఫ్యూచర్‌ మార్కెట్లో  అమెరికా ఇండెక్సుల పతనాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌)కు చైనీస్‌ యువాన్‌ విలువ తగ్గింపు ద్వారా అక్రమ వాణిజ్య విధానాలకు తెరతీస్తున్న చైనాపై ఫిర్యాదు చేయనున్నట్లు యూఎస్‌ ఆర్థిక మంత్రి స్టీవెన్‌ ముచిన్‌ పేర్కొనడం కొసమెరుపు! 
 
7 నెలల తదుపరి
ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపగల అమెరికా, చైనా మధ్య ఉన్నట్టుండి వాణిజ్య వివాదాలు ముదరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు మరింత పెరిగాయి. దీంతో సోమవారం మూకుమ్మడిగా అమ్మకాలకు ఎగబడ్డారు. ఫలితంగా డిసెంబర్‌ తదుపరి మార్కెట్లు మళ్లీ భారీగా నష్టపోయాయి. డోజోన్స్‌ 767 పాయింట్లు(3 శాతం) పతనమై 25,718 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ సైతం 87 పాయింట్లు(3 శాతం) కోల్పోయి 2,845 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 278 పాయింట్లు(3.5 శాతం) దిగజారి 7,726 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా ఆరో రోజు ఇండెక్సులు కుదేలయ్యాయి.

Image result for micron technology

యువాన్‌ షాక్‌
గత 11 ఏళ్లలోలేని విధంగా చైనీస్‌ కరెన్సీ యువాన్‌ 7 దిగువకు(7.12కు) చేరింది. 2010 తదుపరి ఇదే కనిష్టం! ఇందుకు చైనా కేంద్ర బ్యాంకు చర్యలు కారణంకాగా.. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఇది కరెన్సీ మ్యానిప్యులేషన్‌ అంటూ మండిపడ్డారు. డాలరు బలపడటం, యువాన్‌ బలహీనపడటం ద్వారా అమెరికన్‌ కంపెనీలకు సమస్యలు ఎదురుకానున్నట్లు ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. మరోవైపు రక్షణాత్మక కరెన్సీగా భావించే జపనీస్‌ యెన్‌ మాత్రం డాలరుతో మారకంలో 7 నెలల గరిష్టం 105.85ను తాకింది. 10 ఏళ్ల అమెరికన్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 2016 అక్టోబర్‌ తరువాత 1.672 శాతానికి నీరసించాయి. 

Image result for micron technology and AMD

యాపిల్‌ దెబ్బ
తాజా పరిస్థితులతో చైనా నుంచి అధికంగా బిజినెస్‌ నిర్వహిస్తున్న టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ 5.2 శాతం పతనమైంది. ఈ బాటలో.. స్కైవర్క్‌ సొల్యూషన్స్‌, అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైసెస్‌, మైక్రాన్‌ టెక్నాలజీ 4.5 శాతం స్థాయిలో క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఫెడెక్స్‌, నైక్‌, కేటర్‌పిల్లర్‌, బోయింగ్‌ 4-2.5 శాతం మధ్య నష్టపోయాయి. కాగా.. త్రైమాసిక ఫలితాలు ఆకట్టుకోవడంతో టైసన్‌ ఫుడ్స్‌ ఇంక్‌ 5 శాతం జంప్‌చేసింది.

Image result for Apple inc

4 రోజుల్లోనే..
గత నాలుగు రోజుల్లో అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే 1.4 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ కేపిటలైజేషన్‌ ఆవిరైంది. వడ్డీ రేటు తగ్గింపు మధ్యంతర సర్దుబాటు మాత్రమే అంటూ ఫెడ్‌ పేర్కొన్న నేపథ్యంలో ప్రారంభమైన మార్కెట్ల పతనం.. తదుపరి చైనా దిగుమతులపై.. ట్రంప్‌ టారిఫ్‌ల ప్రకటనతో ఊపందుకుంది. తాజాగా.. చైనా సైతం టారిఫ్‌ల విధింపునకు సై అనడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. చైనా కరెన్సీ యువాన్‌ పతనం కారణంగా ఇకపై స్టాక్స్‌లో అమ్మకాలు మరింత పెరగనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

యూరోప్‌, ఆసియా సైతం
సోమవారం యూరోపియన్‌ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే 1.8-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ధోరణి కనిపిస్తోంది. చైనా 2.4 శాతం వెనకడుగు వేయగా.. జపాన్‌, ఇండోనేసియా, హాంకాంగ్‌ 1.5 శాతం చొప్పున నీరసించాయి. మిగిలిన మార్కెట్లలో సింగపూర్‌, తైవాన్‌, కొరియా, థాయ్‌లాండ్ 0.8-0.4 శాతం మధ్య నష్టపోయాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');