నేడు మార్కెట్లు 'బేర్‌'?!

నేడు మార్కెట్లు 'బేర్‌'?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 95 పాయింట్లు పతనమై 10,775 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురడంతో సోమవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం పతన బాట పట్టాయి. దీంతో దేశీయంగానూ మరోసారి మార్కెట్లు పతనంతో ప్రారంభమయ్యే అవకాశముంది. అమెరికా, చైనా వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధిపై అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్ల బాటలో నేడు కూడా దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచే అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

చివరి వరకూ కోలుకోలేదు
వాణిజ్య వివాదాలు, కశ్మీర్‌కు సైన్యం తరలింపు తదితర ఆందోళనల నడుమ సోమవారం పతనంతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ నేలచూపులతోనే కదిలాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయగల అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల నేపథ్యంలో చివరికి భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 418 పాయింట్లు పతనమై 36,670 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 135 పాయింట్లు కోల్పోయి 10,862 వద్ద స్థిరపడింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు కొనసాగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు ఊపందుకున్నాయి. దీంతో వారాంతాన యూఎస్‌ మార్కెట్లు పతనంకాగా.. ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. యూరోపియన్‌ మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభంకావడంతో సెన్సెక్స్‌ ఒక దశలో 700 పాయింట్లు పడిపోయింది. 34,417 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ సైతం 200 పాయింట్లకుపైగా పతనమై 10,783 దిగువకు చేరింది.

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,798 పాయింట్ల వద్ద, తదుపరి 10,734 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,911 పాయింట్ల వద్ద, తదుపరి 10,960 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,403, 27,158 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 27,880, 28,112 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
గత వారమంతా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే కట్టుబడిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం మరోసారి రూ. 2017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నగదు విభాగంలో మరోపక్క దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1871 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. నగదు విభాగంలో గత వారం ఎఫ్‌పీఐలు సుమారు రూ. 6700 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా..  డీఐఐలు రూ. 8,270 కోట్లను ఇన్వెస్ట్‌ చేయడం విశేషం! 



Most Popular