రూపాయి పతనం- 70 దిగువకు

రూపాయి పతనం- 70 దిగువకు

వారాంతాన భారీగా నీరసించిన దేశీ కరెన్సీ మరోసారి డీలా పడింది. డాలరుతో మారకంలో రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 68 పైసలు(1 శాతం) వెనకడుగు వేసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 70.28 వద్ద బలహీనంగా మొదలైంది. తదుపరి మరింత తిరోగమించింది. ప్రస్తుతం 84 పైసలు(1.2 శాతం) పతనమై 70.44 వద్ద ట్రేడవుతోంది. వెరసి మే 17 తరువాత కనిష్టానికి చేరింది. కాగా.. శుక్రవారం సైతం డాలరుతో మారకంలో రూపాయి భారీగా 54 పైసలు క్షీణించింది. 69.60 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 69.67 వరకూ నీరసించింది. వెరసి వరుసగా రెండో రోజు రూపాయి పతన బాటలో సాగుతోంది. 
 
ట్రేడ్‌  వార్ భయాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల అమెరికా, చైనా మధ్య తాజాగా చెలరేగిన వాణిజ్య వివాదాలు అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంటును దెబ్బకొట్టినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో ఈక్విటీలు, కరెన్సీలు బలహీనపడగా.. బంగారానికి డిమాండ్‌ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. మరోపక్క రక్షణాత్మక కరెన్సీగా భావించే జపనీస్‌ యెన్‌ బలపడుతుంటే.. రూపాయి నీరసిస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు పసిడి, ముడిచమురు ధరలు సైతం కారణమవుతున్నట్లు తెలియజేశారు. అమెరికా టారిఫ్‌లు విధిస్తే తగిన విధంగా స్పందిస్తామంటూ తాజాగా చైనా ప్రభుత్వం జవాబివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. వచ్చే నెల నుంచి 300 బిలియన్‌ డాలర్ల చైనీస్ దిగుమతులపై 10 శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లు ట్రంప్‌ గత వారం ప్రకటించిన విషయం విదితమే.
  
ఎఫ్‌పీఐల వెనకడుగు
దేశీ కేపిటల్‌ మార్కెట్ల నుంచి ఈ నెల తొలి రెండు ట్రేడింగ్ సెషన్లలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2881 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఎఫ్‌పీఐలు జులై 1-26 మధ్య కేపిటల్‌ మార్కెట్ల(ఈక్విటీలు, రుణ సెక్యూరిటీలు) నుంచి నికరంగా రూ. 3760 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈక్విటీల నుంచి భారీగా రూ. 14,383 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డెట్‌ మార్కెట్లో రూ. 10,624 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.