స్పందన స్ఫూర్తి ఐపీవో నేడు

స్పందన స్ఫూర్తి ఐపీవో నేడు

మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ స్పందన స్ఫూర్తి పబ్లిక్‌ ఇష్యూ నేటి(5) నుంచి ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఏర్పాటైన కంపెనీ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 853-856కాగా.. బుధవారం(7న) ముగియనుంది. ఆఫర్‌లో భాగంగా 93.56 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు రూ. 400 కోట్లవిలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 1200 కోట్లవరకూ సమీకరించాలని స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌ భావిస్తోంది. వీటిలో ఇప్పటికే స్పందనలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు రూ. 801 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇతర వివరాలు చూద్దాం..

నాలుగో కంపెనీ
దేశీయంగా మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలలో ఇప్పటికే క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌, శాటిన్‌ క్రెడిట్‌కేర్‌ నెట్‌వర్క్‌, భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ స్టాక్‌ మార్కెట్లలో లిస్టింగ్‌ సాధించాయి. వీటిలో భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ను ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది. కాగా.. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కేపిటల్‌ బేస్‌ను పెంచుకోవడానికి వినియోగించనున్నట్లు స్పందన స్ఫూర్తి వ్యవస్థాపకురాలు, ఎండీ పద్మజా రెడ్డి తెలియజేశారు. తద్వారా సాధారణ కార్పొరేట్‌, భవిష్యత్‌ పెట్టుబడి అవసరాలకు నిధులను వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది 70 బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జూన్‌కల్లా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో 929 బ్రాంచీలను నెలకొల్పినట్లు తెలియజేశారు. కంపెనీలో కేదారా కేపిటల్‌ 60 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలో ప్రమోటర్‌ పద్మజా రెడ్డి వాటా 20 శాతంకాగా.. వేలియంట్ మారిషస్, జేఎం ఫైనాన్షియల్‌ ఇండియా ట్రస్ట్‌ తదితరాలు సైతం వాటాలను కలిగి ఉన్నాయి. మార్చికల్లా కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 40 శాతం పెరిగి రూ. 4437 కోట్లకు చేరాయి.