అఫ్లే ఇండియా ఐపీవో- అదుర్స్‌

అఫ్లే ఇండియా ఐపీవో- అదుర్స్‌

గత నెలాఖరు(31)న ముగిసిన అఫ్లే ఇండియా పబ్లిక్‌ ఇష్యూకి ఏకంగా 86 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. మొబైల్‌ మార్కెటింగ్‌ కంపెనీ అఫ్లే ఇండియా ఇష్యూకి  ధరల శ్రేణి రూ. 740-745కాగా.. ఆఫర్‌లో భాగంగా యాంకర్‌ విభాగంతో కలిపి దాదాపు 49.5 లక్షల షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా రూ. 459 కోట్లవరకూ సమీకరించాలని భావించింది. అంతేకాకుండా రూ. 90 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. యూపీఐ మెకనిజం ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించిన తొలి ఐపీవోగా ఆఫ్లే ఇండియా నిలవడం గమనార్హం!

29 కోట్ల షేర్లకు
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా అఫ్లే ఇండియా 34 లక్షల షేర్లను విక్రయానికి పెట్టగా.. 29.2 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. వెరసి ఇష్యూకి 86 రెట్లు అధికంగా స్పందన కనిపించింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) విభాగంలో 55 రెట్లు, సంపన్న వర్గాల విభాగంలో 199 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి సైతం దాదాపు 11 రెట్లు అధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి.
 
యాంకర్‌ నిధులు
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా అఫ్లే ఇండియా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 206 కోట్లను సమీకరించింది. ఒక్కో షేరుకీ రూ. 745 ధరలో 27.72 లక్షలకుపైగా షేర్లను యాంకర్‌ సంస్థలకు కేటాయించింది. యాంకర్‌ కంపెనీలలో అబెర్డీన్‌ ఏషియన్‌ స్మాలర్‌ కంపెనీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ విడివిడిగా 3 లక్షల షేర్లు చొప్పున కొనుగోలు చేశాయి. గోల్డ్‌మన్‌ శాక్స్‌, మలబార్‌ ఇండియా తదితర కంపెనీలు సైతం యాంకర్‌ ఇన్వెస్టర్లలో ఉన్నాయి. ఐపీవో నిధులను పెట్టుబడులు, వర్కింగ్‌ కేపిటల్‌, ఇతర సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో అఫ్లే ఇండియా పేర్కొంది.