అశోక్‌ లేలాండ్‌- జేకే టైర్‌.. స్కిడ్

అశోక్‌ లేలాండ్‌- జేకే టైర్‌.. స్కిడ్

జులైలో వాహన విక్రయాలు నీరసించడంతో ఆటో రంగ దేశీ దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. గత 10 నెలల్లోలేని విధంగా ఈ కౌంటర్‌ కుప్పకూలగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆటో రంగ కంపెనీ జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం బలహీనపడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

అశోక్‌ లేలాండ్ లిమిటెడ్‌
ఈ జులైలో అశోక్‌ లేలాండ్ వాహన విక్రయాలు 28 శాతం క్షీణించి 10,927 యూనిట్లకు పరిమితమయ్యాయి. దేశీయంగా భారీ, మధ్యతరహా వాణిజ్య వాహన అమ్మకాలు 47 శాతం పడిపోయి 4668 యూనిట్లకు చేరాయి. భారీ, మధ్యతరహా బస్సుల విక్రయాలు సైతం 5 శాతం తక్కువగా 1350 యూనిట్లను తాకాయి. ఇక భారీ, మధ్యతరహా ట్రక్కుల ఎగుమతులు 48 శాతం నీరసించి 4858 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా.. డీలర్ల వద్ద పేరుకుపోయిన వాహన నిల్వలను తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు అశోక్‌ లేలాండ్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ మాధవన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలోఅశోక్‌ లేలాండ్‌ షేరు 2018 అక్టోబర్‌ తరువాత మళ్లీ 11 శాతం దిగజారింది. రూ. 61 దిగువకు చేరింది. 2015 ఫిబ్రవరి తదుపరి ఇది కనిష్టంకావడం గమనార్హం!

Image result for jk tyre & industries ltd

జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్)లో జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 74 శాతం పడిపోయి రూ. 17 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పెరిగి రూ. 2588 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ షేరు 9 శాతం పతనమైంది. రూ. 65 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 61 దిగువన 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. కాగా.. బీఎస్‌ఈలో గత రెండు వారాల సగటు 36,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 72,000 షేర్లకుపైగా చేతులు మారడం గమనార్హం!Most Popular