మరోసారి నష్టాల ఓపెనింగ్‌?!

మరోసారి నష్టాల ఓపెనింగ్‌?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 48 పాయింట్లు క్షీణించి 11,073 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లలో పావు శాతం కోత విధించింది. అయితే ఈ ఏడాదికి ఇక రేట్ల కోత ఉండబోదంటూ స్పష్టమైన సంకేతాలిచ్చింది. దీంతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు పుంజుకోగా.. పసిడి డీలాపడింది. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు కూడా దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచే అవకాశమున్నట్లు  విశ్లేషకులు భావిస్తున్నారు. 

మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌
చైనా దిగుమతులపై అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వ్యాఖ్యల ప్రభావంతో బుధవారం నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ రికవరీ బాట పట్టాయి. ట్రేడర్లు స్క్వేరప్‌ లావాదేవీలు చేపట్టడంతో చివరి వరకూ లాభాలతోనే కదిలాయి. అయితే తొలుత సెన్సెక్స్‌ 250 పాయింట్లకుపైగా పతనంకాగా.. నిఫ్టీ సైతం 11,000 పాయింట్ల కీలక మార్క్‌ దిగువకు చేరింది. తదుపరి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు నష్టాలను పూడ్చుకోవడంతోపాటు.. లాభాలతో ముగిశాయి. వెరసి సెన్సెక్స్‌ 84 పాయింట్లు పుంజుకుని 37,481 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 33 పాయింట్లు బలపడి 11,118 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,030 పాయింట్ల వద్ద, తదుపరి 10,942 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,175 పాయింట్ల వద్ద, తదుపరి 11,233 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 28,611, 28,345 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 29,061, 29,245 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1497 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2479 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. గత రెండు రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 1348 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 2432 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. 



Most Popular