నష్టాల ఓపెనింగ్‌ నేడు?!

నష్టాల ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 11,048 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. మాట తప్పుతూ చైనా తమ నుంచి తగినన్ని వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంలేదంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా పేర్కొనడంతో మంగళవారం యూరోపియన్‌,  అమెరికన్‌ మార్కెట్లు నష్టపోయాయి. ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ట్రెండ్‌ కనిపిస్తోంది. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలిచే అవకాశమున్నట్లు  విశ్లేషకులు భావిస్తున్నారు. 

మళ్లీ మార్కెట్ల పతనం!
కొద్ది రోజులుగా వాటిల్లుతున్న నష్టాలకు చెక్‌ పెడుతూ మంగళవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి తోకముడిచాయి. కొన్ని ఎంపిక చేసిన బ్లూచిప్స్‌లో మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. వెరసి సెన్సెక్స్‌ 289 పాయింట్లు కోల్పోయి 37,397 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 104 పాయింట్లు పతనమై 11,085 వద్ద స్థిరపడింది. గత వారాంతాన ఆరు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ వేస్తూ స్వల్పంగా లాభపడిన మార్కెట్లు తిరిగి సోమవారం నీరసించిన విషయం విదితమే.  

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,016 పాయింట్ల వద్ద, తదుపరి 10,947 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,211 పాయింట్ల వద్ద, తదుపరి 11,337 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 28,509, 28,227 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 29,302, 29,812 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐల ఇన్వెస్ట్‌మెంట్ష్
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 644 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1080 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. సొమవారం ఎఫ్‌పీఐలు రూ. 704 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 1352 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.



Most Popular