అఫ్లే ఇండియా ఐపీవో.. సంగతేంటి?

అఫ్లే ఇండియా ఐపీవో.. సంగతేంటి?

మొబైల్‌ మార్కెటింగ్‌ కంపెనీ అఫ్లే ఇండియా పబ్లిక్‌ ఇష్యూ 29న(సోమవారం) ప్రారంభంకానుంది. 31న(బుధవారం) ముగియనున్న ఇష్యూకి  ధరల శ్రేణి రూ. 740-745. ఆఫర్‌లో భాగంగా దాదాపు 0.5 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 459 కోట్లవరకూ సమీకరించాలని భావిస్తోంది. వీటిలో రూ. 90 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 20 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యూపీఐ మెకనిజం ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కలిగిన తొలి ఐపీవోగా ఆఫ్లే ఇండియా నిలవనుంది.

యాంకర్‌ నిధులు
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా అఫ్లే ఇండియా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 206 కోట్లను సమీకరించింది. ఒక్కో షేరుకీ రూ. 745 ధరలో శుక్రవారం 27.72 లక్షలకుపైగా షేర్లను యాంకర్‌ సంస్థలకు కేటాయించింది. యాంకర్‌ కంపెనీలలో అబెర్డీన్‌ ఏషియన్‌ స్మాలర్‌ కంపెనీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ విడివిడిగా 3 లక్షల షేర్లు చొప్పున కొనుగోలు చేశాయి. గోల్డ్‌మన్‌ శాక్స్‌, మలబార్‌ ఇండియా తదితర కంపెనీలు సైతం యాంకర్‌ ఇన్వెస్టర్లలో ఉన్నాయి. ఐపీవో నిధులను పెట్టుబడులు, వర్కింగ్‌ కేపిటల్‌, ఇతర సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో అఫ్లే ఇండియా పేర్కొంది.

ఆర్థిక పనితీరు
మొబైల్‌ మార్కెటింగ్‌ కంపెనీ అఫ్లే ఇండియాలో గ్లోబల్‌ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ 6.48 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. గత ఆర్థిక సంవత్సరం(2018-19)లో అఫ్లే ఇండియా రూ. 249 కోట్ల ఆదాయం సాధించింది. నిర్వహణ లాభం రూ. 70 కోట్లుకాగా.. ఇబిటా మార్జిన్లు 28.2 శాతంగా నమోదయ్యాయి. దాదాపు రూ. 49 కోట్ల నికర లాభం ఆర్జించింది. రూ. 19 షేరువారీ ఆర్జన(ఈపీఎస్‌) సాధించింది. కంపెనీ ప్రధానంగా రెండు బిజినెస్‌ విభాగాలను నిర్వహిస్తోంది. ఓవైపు కన్జూమర్‌ ప్లాట్‌ఫామ్‌, ఎంటర్‌ప్రైజ్‌ ప్లాట్‌ఫామ్‌. మొబైల్‌ ప్రకటనల ద్వారా కన్జూమర్ కన్వర్షన్స్‌ నిర్వహిస్తోంది.  

ఇతర వివరాలు
మొబైల్‌ ప్రకటనల ద్వారా ఈకామర్స్‌ కంపెనీలకున్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని లావాదేవీల పూర్తికి సహకరిస్తోంది.  మరోపక్క ఆన్‌లైన్‌ వినియోగదారుడు ఆఫ్‌లైన్‌లో స్టోర్లను దర్శించేందుకు వీలుగా ఆన్‌లైన్‌ టు ఆఫ్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తోంది. డిజిటల్‌ ప్రకటనల మోసాల నివారణ, వినియోగదారుల గోప్యత రక్షణ, మొబైల్‌ ప్రకటనల నిర్వహణ తదితర సర్వీసులు అందిస్తోంది. వినియోగదారుల లావాదేవీల ఆధారంగా వారి అభిరుచులు, కొనుగోళ్లలో ఆసక్తి తదితర అంశాలను విశ్లేషిస్తూ ఈకామర్స్‌, రిటైల్‌, ఎఫ్‌ఎంసీజీ తదితర కంపెనీలకు సహకరిస్తోంది.