మార్కెట్లకు దిక్సూచి.. క్యూ1

మార్కెట్లకు దిక్సూచి.. క్యూ1

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా డెరివేటివ్స్‌, కార్పొరేట్‌ ఫలితాలు ప్రభావితం చేయనున్నాయి. జులై ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు గురువారం(25న) ముగియనుంది. దీంతో ఇకపై ఆగస్ట్‌ సిరీస్‌కు ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్‌ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాగా.. ఇప్పటికే ప్రారంభమైన క్యూ1(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాల సీజన్‌ మరింత ఊపందుకోనుంది. శుక్రవారం(19న) మార్కెట్లు ముగిశాక ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(20198-20) క్యూ1 పనితీరును వెల్లడించింది. ఈ బాటలో నేడు ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. దీంతో సోమవారం(22న) అటు మార్కెట్లు.. ఇటు ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.

Image result for stock traders

క్యూ1 జాబితా ఇలా..
ఈ వారం క్యూ1 ఫలితాలు విడుదల చేయనున్న ప్రధాన కంపెనీల జాబితాలో ప్రయివేట్‌ రంగ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌(22న), ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌, ఇంజినీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ(23న), బ్లూచిప్‌ కంపెనీ ఏషియన్‌ పెయింట్స్‌(24న) చోటు చేసుకున్నాయి. ఈ బాటలో 25న ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజాలు బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, 26న ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ క్యూ1 ఫలితాలు వెల్లడించనున్నాయి.

విదేశీ పరిస్థితులూ కీలకమే
గురువారం యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ) మానిటరీ పాలసీల సమీక్షను చేపట్టనుంది. ఈసారి సమీక్షలో మరోసారి సహాయక ప్యాకేజీల ప్రణాళికలు ప్రకటించవచ్చన్న అంచనాలు ఇటీవల బలపడ్డాయి. మరోవైపు అక్టోబర్‌ 31లోగా బ్రిటన్‌ కొత్త ప్రధానిని ఎంపిక చేసుకోవలసి ఉంది. తద్వారా బ్రెక్సిట్‌ డీల్‌పై తిరిగి చర్చలు చేపట్టేందుకు వీలుంటుంది. ఇందుకు వీలుగా థెరెసా మే స్థానే కొత్త నేతను అధికారిక కన్సర్వేటివ్‌ పార్టీ ఎంపిక చేసుకోనుంది. కాగా.. ఈ ఏడాది క్యూ2(ఏప్రిల్‌-జూన్‌)లో అమెరికా జీడీపీ ముందస్తు గణాంకాలు శుక్రవారం(26న) విడుదలకానున్నాయి.

ఈ అంశాలకూ ప్రాధాన్యం
రుతుపవనాల విస్తరణ, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదిలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, అమెరికా- చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు వంటి పలు అంశాలు సైతం మార్కెట్లపై ప్రభావాన్ని చూపగలవని సాంకేతిక నిపుణులు తెలియజేస్తున్నారు.