మార్కెట్లు బేర్‌- ఆటో, ఫార్మా కుదేల్‌

మార్కెట్లు బేర్‌- ఆటో, ఫార్మా కుదేల్‌

ప్రపంచ మార్కెట్ల జోష్‌తో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో వెనువెంటనే అమ్మకాలు ఊపందుకున్నాయి. తొలుత లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్‌ తదుపరి నష్టాలలోకి ప్రవేశించింది. మిడ్‌ సెషన్‌ నుంచీ అమ్మకాలు మరింత పెరగడంతో మార్కెట్లు చివరికి భారీగా పతనమయ్యాయి.తదుపరి ఏ దశలోనూ కోలుకోలేదు..ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 560 పాయింట్లు పడిపోయి 38,337 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ సైతం నిఫ్టీ సైతం 178 పాయింట్లు  కోల్పోయి11,419 వద్ద ముగిసింది. న్యూయార్క్‌ ఫెడ్‌ ప్రెసిడెంట్‌ జాన్‌.. తాజాగా వడ్డీ రేట్ల తగ్గింపును సమర్థించడంతో అటు అమెరికా, ఇటు ఆసియా మార్కెట్లు బలపడ్డాయి. ఈ ప్రభావంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం ప్రారంభంలోనే జోరందుకున్నాయి. 

బ్యాంక్స్‌ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 3.3-1.3 శాతం మధ్య క్షీణించాయి. ప్రధానంగా ఆటో, బ్యాంక్స్‌, ఫార్మా, మీడియా రంగాలు 3.3-2.5 శాతం మధ్య నీరసించాయి. ఆటో కౌంటర్లలో ఎక్సైడ్‌, అమరరాజా, మదర్‌సన్‌, ఎంఅండ్‌ఎం, ఐషర్‌, టీవీఎస్‌, టాటా మోటార్స్‌, హీరో మోటో, ఎంఆర్‌ఎఫ్‌, బాష్‌, బజాజ్‌ ఆటో, అశోక్‌ లేలాండ్‌, మారుతీ 6-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఫార్మా కౌంటర్లలో బయోకాన్‌, పిరమల్‌, అరబిందో, గ్లెన్‌మార్క్‌, సిప్లా, కేడిలా హెల్త్‌, దివీస్‌ లేబ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, లుపిన్‌, సన్‌ ఫార్మా 9-1.2 శాతం మధ్య తిరోగమించాయి. ఇక బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో ఆర్‌బీఎల్‌ 14 శాతం కుప్పకూలగా.. ఐడీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్, యస్‌ బ్యాంక్‌, బీవోబీ, కొటక్‌ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పీఎన్‌బీ 4-1 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, టైటన్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ మాత్రమే అదికూడా 2.2-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.   
 
చిన్న షేర్లు బోర్లా
మార్కెట్లు హుషారుగా ప్రారంభమై పతనంతో ముగిసిన నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 2 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1919 నష్టపోగా.. 619 మాత్రమే లాభాలతో ముగిశాయి.