ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌- క్యూ1 భేష్‌..కానీ

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌- క్యూ1 భేష్‌..కానీ

ప్రయివేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో బ్యాంకు నికర లాభం 41 శాతం ఎగసి రూ. 267 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 48 శాతం పుంజుకుని రూ. 817 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) స్థిరంగా 1.38 శాతం వద్దే నమోదయ్యాయి. త్రైమాసిక ప్రాతిపదికన నికర ఎన్‌పీఏలు 0.69 శాతం నుంచి 0.65 శాతానికి వెనకడుగు వేశాయి. ఇక ప్రొవిజన్లు రూ. 213 కోట్లుకాగా.. క్యూ4లో రూ. 200 కోట్లుగా నమోదు చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన స్లిప్పేజెస్‌ రూ. 206 కోట్ల నుంచి రూ. 225 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో రూ. 147 కోట్లను రైటాఫ్‌ చేసింది. క్యూ4లో ఇవి రూ. 91 కోట్లు. కాగా.. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) ఆల్‌టైమ్‌ గరిష్టమైన 4.3 శాతాన్ని తాకాయి.

గైడెన్స్‌ వీక్‌
రానున్న కాలంలో అదనపు ప్రొవిజన్లు చేపట్టవలసి ఉంటుందని దీంతో రుణ వ్యయాలు 0.35-0.4 శాతంమేర పెరగవచ్చని బ్యాంకు యాజమాన్యం ఒక ఇంటర్వ్యూలో అంచనా వేసింది. ఇదే విధంగా స్థూల ఎన్‌పీఏలు 2.25-2.5 శాతానికి చేరవచ్చంటూ అభిప్రాయపడింది. కొన్ని కార్పొరేట్‌ ఖాతాలు సమస్యాత్మకంగా పరిణమించినట్లు తెలియజేసింది. ఈ ఏడాది క్యూ1లో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అయితే ఈ ఏడాది పనితీరుపై తాజా అంచనాలు(గైడెన్స్‌) నిరాశపరచడంతో షేరు ఆటుపోట్లను చవిచూస్తోంది. ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేరు క్రితం ముగింపు రూ. 580కాగా.. ఎన్‌ఎస్‌ఈలో తొలుత రూ. 590 వరకూ ఎగసింది. తదుపరి రూ. 544 దిగువకు పతనమైంది. ప్రస్తుతం 5.3 శాతం తిరోగమించి రూ. 549 వద్ద ట్రేడవుతోంది.