హాట్సన్‌- హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ.. కేక

హాట్సన్‌- హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ.. కేక

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో ప్రయివేట్‌ రంగ డైరీ ఉత్పత్తుల కంపెనీ హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. మరోవైపు ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో దూకుడు చూపుతున్న  ప్రయివేట్‌ రంగ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో పాల ఉత్పత్తుల దిగ్గజం హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ నికర లాభం 35 శాతం ఎగసి రూ. 51 కోట్లను అధిగమించింది. గతేడాది(2018-19) క్యూ1లో రూ. 38 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం 16 శాతం పుంజుకుని రూ. 1432 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్ షేరు 6.3 శాతం జంప్‌చేసి రూ. 748 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 775 వరకూ ఎగసింది. ఆరోక్య బ్రాండుతో పాలు, అరుణ్‌ పేరుతో ఐస్‌క్రీమ్స్‌ విక్రయించే హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్ కంపెనీలో ప్రమోటర్లకు 73.54% వాటా ఉంది.  

Image result for hdfc asset management company

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) షేరు వరుసగా నాలుగో రోజు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6.3 శాతం జంప్‌చేసి రూ. 2306 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2370 వరకూ జంప్‌చేసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. నాలుగు రోజుల్లోనే ఈ షేరు 19 శాతం ర్యాలీ చేయడం విశేషం! గత రెండు వారాల ట్రేడింగ్‌ పరిమాణం సగటు 34,000 షేర్లుకాగా.. నేటి ట్రేడింగ్‌లో ఇప్పటివరకూ 1.6 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ నెల 15న హెచ్‌డీఫ్‌సీ ఏఎంసీ షేరు రూ. 1935 వద్ద ముగిసిన విషయం విదితమే.
నికర లాభం అప్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో  హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నికర లాభం 42 శాతం ఎగసి రూ. 292 కోట్లను తాకింది. ఇందుకు వ్యయాల కట్టడి, ఇతర ఆదాయం మెరుగుపడటం దోహదం చేశాయి.  మొత్తం ఆదాయం 10 శాతం పెరిగి రూ. 553 కోట్లకు చేరింది. ఏఎంసీ బిజినెస్‌ నిర్వహణ లాభం 44 శాతం జంప్‌చేసి రూ. 381 కోట్లను తాకింది. జూన్‌కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 18 శాతం పుంజుకుని రూ. 3,56,700 కోట్లకు చేరింది.