ఎల్‌అండ్‌టీ ఇన్ఫో - మారుతీ స్కిడ్‌

ఎల్‌అండ్‌టీ ఇన్ఫో - మారుతీ స్కిడ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించనున్న అంచనాలతో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ లిమిటెడ్‌ కౌంటర్‌లో మరోసారి ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి.. ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఐటీ సేవల సంస్థ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ నికర లాభం 6 శాతం క్షీణించి రూ. 356 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం పుంజుకుని రూ. 2586 కోట్లకు చేరింది. ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ స్పెషలిస్ట్‌ కంపెనీ లింబిక్‌ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 1518 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1495 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 74.79% వాటా ఉంది.

Image result for maruti suzuki ltd

మారుతీ సుజుకీ 
కొంత కాలంగా నేలచూపులతో కదులుతున్న ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ కౌంటర్‌ మరోసారి బలహీనపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 1.5 శాతం క్షీణించి రూ. 5804 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 5775 వద్ద రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. 2017 జనవరి 25 తదుపరి ఇది కనిష్టంకాగా.. ఇటీవల దేశీ ఆటో రంగం మందగమనంలో పడటంతో గత మూడు నెలల్లోనూ మారుతీ షేరు 22 శాతం కోల్పోయింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో వాహన అమ్మకాలు 18 శాతం తగ్గడంతో గత మూడు రోజుల్లోనే 6 శాతం నీరసించింది. గతేడాది జులై 24న నమోదైన రూ. 9923 ధరతో పోలిస్తే మారుతీ షేరు 42 శాతం పతనమైంది. క్యూ1 ఫలితాలు నిరాశపరచవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు బ్రోకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.