ప్రపంచ మార్కెట్ల జోష్‌తో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో వెనువెంటనే అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో తొలుత లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్ తదుపరి నష్టాలలోకి ప్రవేశించింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ప్రస్తుతం మార్కెట్లు పతన బాట పట్టాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 262 పాయింట్లు పతనమై 38,635కు చేరింది. తద్వారా 39,000 పాయింట్ల మైలురాయి దిగువకు చేరింది. ఇక నిఫ్టీ సైతం 85 పాయింట్లు క్షీణించి 11,512 వద్ద ట్రేడవుతోంది. న్యూయార్క్ ఫెడ్ ప్రెసిడెంట్ జాన్.. తాజాగా వడ్డీ రేట్ల తగ్గింపును సమర్థించడంతో అటు అమెరికా, ఇటు ఆసియా మార్కెట్లు బలపడ్డాయి. ఈ ప్రభావంతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం ప్రారంభంలోనే జోరందుకున్నాయి.
ఆటో, ఫార్మా డౌన్
ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ క్షీణించగా.. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, రియల్టీ రంగాలు 1.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఆటో కౌంటర్లలో ఎంఅండ్ఎం, అశోక్ లేలాండ్, టీవీఎస్, హీరో మోటో, బజాజ్ ఆటో, మారుతీ, టాటా మోటార్స్, ఐషర్, 2.5-1.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. రియల్టీ కౌంటర్లలో ఒబెరాయ్, సన్‌టెక్, ప్రెస్టేజ్, ఫీనిక్స్, మహీంద్రా లైఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, శోభా 3-1 శాతం మధ్య నీరసించాయి. ఇక నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, గెయిల్, బజాజ్ ఫిన్, ఇన్ఫ్రాటెల్ 3.5-2 శాతం మధ్య క్షీణించాయి. బ్లూచిప్స్‌లో కేవలం టైటన్, అల్ట్రాటెక్, ఎన్టీపీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్ 1-0.5 శాతం మధ్య లాభపడ్డాయి.
ఎక్సైడ్, అమరరాజా వీక్
డెరివేటివ్స్‌లో ఎక్సైడ్, అమరరాజా, దివాన్, క్యాస్ట్రాల్, డిష్ టీవీ, టాటా గ్లోబల్, బిర్లా సాఫ్ట్ 5-2.2 శాతం మధ్య తిరోగమించాయి. కాగా.. మరోవైపు ఏసీసీ, ఎన్సీసీ, జస్ట్ డయల్, ఇంద్రప్రస్థ, ఇండిగో, మైండ్‌ట్రీ, ఎస్ఆర్ఎఫ్, ఎన్ఎండీసీ 2.4-1 శాతం మధ్య ఎగశాయి.
చిన్న షేర్లు బోర్లా
మార్కెట్లు హుషారుగా ప్రారంభమై పతన బాట పట్టిన నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.9-0.7 శాతం చొప్పునబలహీనపడ్డాయి. ఇప్పటివరకూ 1330 షేర్లు నష్టపోగా.. 530 లాభాలతో కదులుతున్నాయి. స్మాల్ క్యాప్స్‌లో తల్వాల్కర్స్ 20 శాతం కుప్పకూలగా.. సైయంట్, కేపిటల్ ట్రస్ట్, టీఐఐఎల్, విశాకా, ట్రైడెంట్, వాటర్‌బేస్, జేబీఎం, డీబీ కార్ప్, శాస్కన్, దప్, ఇండోరమా, వీఐపీ, నోసిల్, ఐఎఫ్బీ ఆగ్రో, కనోరియా తదితరాలు 11-5 శాతం మధ్య పతనమయ్యాయి.