శాస్కన్‌ బోర్లా - ర్యాలీస్‌ ర్యాలీ

శాస్కన్‌ బోర్లా - ర్యాలీస్‌ ర్యాలీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీ శాస్కన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో టాటా గ్రూప్‌ దిగ్గజం ర్యాలీస్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి శాస్కన్‌ భారీ నష్టాలతో వెలవెలబోగా.. ర్యాలీస్‌ లాభాల ర్యాలీతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

శాస్కన్‌ టెక్నాలజీస్‌ 
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఐటీ సేవల సంస్థ శాస్కన్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 15 శాతం క్షీణించి రూ. 23 కోట్లకు పరిమితమైంది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 135 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో శాస్కన్‌ టెక్నాలజీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6.5 శాతం పతనమై రూ. 584 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 576 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. 

Image result for rallis india ltd

ర్యాలీస్‌ ఇండియా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో అగ్రి కెమికల్స్‌ దిగ్గజం ర్యాలీస్‌ ఇండియా లిమిటెడ్‌ నికర లాభం 68 శాతం ఎగసి రూ. 68 కోట్లకు చేరింది. గతేడాది(2018-19) క్యూ1లో రూ. 55 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇక కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 573 కోట్ల నుంచి రూ. 623 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ర్యాలీస్‌ ఇండియా షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 159 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 166 వరకూ ఎగసింది.