సైయెంట్‌ పతనం- ఏసీసీ.. ప్లస్‌

సైయెంట్‌ పతనం- ఏసీసీ.. ప్లస్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో సాఫ్ట్‌వేర్ సేవల హైదరాబాద్‌ కంపెనీ సైయెంట్ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో సిమెంట్‌ రంగ దిగ్గజం ఏసీసీ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి సైయెంట్‌ నష్టాలతో వెలవెలబోగా.. ఏసీసీ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..

సైయెంట్‌ లిమిటెడ్‌ 
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో సైయెంట్‌ లిమిటెడ్‌ నికర లాభం 49 శాతం క్షీణించి రూ. 90.5 కోట్లకు పరిమితమైంది. త్రైమాసిక ప్రాతిపదికన  మొత్తం ఆదాయం సైతం 6.5 శాతం నీరసించి రూ. 1089 కోట్లకు చేరింది. ఇక డాలర్ల రూపేణా ఆదాయం 5.2 శాతం తక్కువగా 15.66 కోట్లను తాకింది. అయితే గతేడాది(2018-19) క్యూ1తో పోలిస్తే నికర లాభం 9.7 శాతం పుంజుకోగా.. ఆదాయం యథాతథంగా నమోదైంది. ఈ నేపథ్యంలో సైయెంట్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 11 శాతం కుప్పకూలింది. రూ. 486 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 482 దిగువన 52 వారాల కనిష్టాన్ని తాకింది. 

Image result for ACC ltd

ఏసీసీ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఏసీసీ లిమిటెడ్‌ నికర లాభం 39 శాతం ఎగసి రూ. 451 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం పెరిగి రూ. 4150 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 25 శాతం పుంజుకుని రూ. 782 కోట్లను తాకగా.. 7.2 ఎంటీ సిమెంట్‌ను విక్రయించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఏసీసీ షేరు 3.25 శాతం ఎగసింది. రూ. 1618 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1648 వరకూ జంప్‌చేసింది.