సెంచరీతో షురూ- సిమెంట్‌ అప్‌!

సెంచరీతో షురూ- సిమెంట్‌ అప్‌!

ప్రపంచ మార్కెట్ల జోష్‌తో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. తాజాగా న్యూయార్క్‌ ఫెడ్‌ ప్రెసిడెంట్‌ జాన్‌.. వడ్డీ రేట్ల తగ్గింపును సమర్థించడంతో అటు అమెరికా, ఇటు ఆసియా మార్కెట్లు బలపడ్డాయి. ఈ ప్రభావంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం ప్రారంభంలోనే జోరందుకున్నాయి. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. ప్రస్తుతం 112 పాయింట్లు పుంజుకుని 39,009కు చేరింది. తద్వారా మరోసారి 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక నిఫ్టీ సైతం 36 పాయింట్లు ఎగసి 11,633 వద్ద ట్రేడవుతోంది. 

మెటల్, ఫార్మా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్‌, ఫార్మా, ఐటీ రంగాలు 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్‌, ఐబీ హౌసింగ్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, యూపీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, వేదాంతా, హెచ్‌సీఎల్‌టెక్‌, ఎయిర్‌టెల్‌ 2-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే యస్‌ బ్యాంక్‌, ఐవోసీ, గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, బ్రిటానియా 1.5-0.5 శాతం మధ్య నీరసించాయి.

అమరరాజా వీక్‌
డెరివేటివ్స్‌లో ఏసీసీ, టాటా ఎలక్సీ, ఐడియా, మైండ్‌ట్రీ, అంబుజా సిమెంట్‌, ఇంద్రప్రస్థ, గోద్రెజ్‌ సీపీ, టొరంట్‌ ఫార్మా, రామ్‌కో సిమెంట్‌ 4-1.25 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క అమరరాజా, దివాన్‌, ఆయిల్‌ ఇండియా, ఎక్సైడ్‌, పీవీఆర్‌, పేజ్‌ ఇండస్ట్రీస్ 2.5-1 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు హుషారుగా ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లకు ఓమాదిరి డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.2 శాతం బలపడింది. ఇప్పటివరకూ 657 షేర్లు లాభపడగా.. 486 నష్టాలతో కదులుతున్నాయి.