సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?!

సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 11,638 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. వరుస నష్టాల నుంచి గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు రికవరీ సాధించాయి. ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బలపడటం ఇందుకు సహకరించింది. అయితే వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న ఆందోళనలతో యూరోపియన్‌ మార్కెట్లు నష్టపోయాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తదుపరి ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

చివర్లో పతనం
అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లను కుంగదీస్తున్నాయి. దీంతో బుధవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు డీలాపడగా.. గురువారం ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. ఈ ప్రభావంతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం బలహీనంగా ప్రారంభమయ్యాయి. మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో చివర్లో మార్కెట్లు పతనబాట పట్టాయి. వెరసి ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 39,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 318 పాయింట్లు పతనమై 38,897 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 91 పాయింట్లు బలహీనపడి 11,597 వద్ద స్థిరపడింది.  

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,560 పాయింట్ల వద్ద, తదుపరి 11,524 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,655 పాయింట్ల వద్ద, తదుపరి 11,714 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 30,283, 30,135 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,674, 30,917 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌ఫీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1405 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 329 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. అంతకుముందు మూడు రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 678 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1439 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.