కాల్గేట్‌- డీబీ కార్ప్‌ క్యూ1.. ఓకే

కాల్గేట్‌- డీబీ కార్ప్‌ క్యూ1.. ఓకే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలు ప్రకటించినప్పటికీ ఓవైపు ఎఫ్‌ఎంసీజీ గ్లోబల్‌ దిగ్గజం కాల్గేట్‌ పామోలివ్‌.. మరోపక్క ప్రింట్‌, మీడియా దిగ్గజం డీబీ కార్ప్‌ లిమిటెడ్‌ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. నష్టాల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

కాల్గేట్‌ పామోలివ్‌ 
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కాల్గేట్‌ పామోలివ్‌ నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 169 కోట్లను తాకింది. అయితే గతేడాది(2018-19) క్యూ1లో లభించిన అనుకోని ఆదాయాన్ని మినహాయించి చూస్తే ప్రస్తుత త్రైమాసిక లాభం 5 శాతం వృద్ధి చూపినట్లని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక మొత్తం ఆదాయం 5 శాతం పెరిగి రూ. 1100 కోట్లకు చేరింది. రామ్‌ రాఘవన్‌ను కంపెనీ ఎండీగా ఎంపిక చేసినట్లు కాల్గేట్‌ పామోలివ్‌ పేర్కొంది. ఆగస్ట్‌ నుంచి రామ్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కాల్గేట్‌ పామోలివ్‌ షేరు 3.5 శాతం జంప్‌చేసి రూ. 1207 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1222 వరకూ ఎగసింది. 

Image result for DB Corp

డీబీ కార్ప్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో డీబీ కార్ప్‌ లిమిటెడ్‌ నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 94 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం తక్కువగా రూ. 607 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 4.4 శాతం పుంజుకుని రూ. 175 కోట్లను అధిగమించింది. నిర్వహణ మార్జిన్లు 26.6 శాతం నుంచి 28.9 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో డీబీ కార్ప్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 178 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 185 వరకూ ఎగసింది.