నష్టాల మార్కెట్లోనూ.. లాభాల హైజంప్‌

నష్టాల మార్కెట్లోనూ.. లాభాల హైజంప్‌

మూడు రోజుల ర్యాలీకి చెక్‌ పడటంతో నష్టాలతో కదులుతున్న మార్కెట్లలో కొన్ని ఎంపిక చేసిన స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ కౌంటర్లు మంచి లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా పెరగడం గమనించదగ్గ అంశం. జాబితాలో డీఎఫ్‌ఎం ఫుడ్స్‌, థెమిస్‌ మెడికేర్‌, ఎంఈపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌, అక్మే స్టార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ చోటు సంపాదించాయి. ఇతర వివరాలు చూద్దాం..

డీఎఫ్‌ఎం ఫుడ్స్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 274 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 293 వరకూ దూసుకెళ్లింది. ఇది 52 వారాల గరిష్టం. గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం సగటున 1,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 36,000 షేర్లు చేతులు మారాయి. 

థెమిస్‌ మెడికేర్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 12 శాతం జంప్‌చేసి రూ. 270 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 286 వరకూ దూసుకెళ్లింది. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1,800 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్‌లో 30,000 షేర్లు చేతులు మారాయి. 

ఎంఈపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మౌలిక సదుపాయాల రంగ ఈ షేరు 14.5 శాతం పురోగమించి రూ. 38 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 39 వరకూ దూసుకెళ్లింది. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 48,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 1.15 లక్షల షేర్లు చేతులు మారాయి. 

అక్మే స్టార్‌ హౌసింగ్‌: ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం ఎగసి రూ. 41 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1400 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 1450 షేర్లు చేతులు మారాయి.