టొరంట్‌ ఫార్మా- సింద్‌ బ్యాంక్‌ డౌన్‌

టొరంట్‌ ఫార్మా- సింద్‌ బ్యాంక్‌ డౌన్‌

అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(USFDA) గుజరాత్‌లోని దహేజ్‌ ప్లాంటుపై అధికారిక చర్యల సంకేతాల(OAI)ను ప్రకటించినట్లు టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. కాగా.. మరోపక్క భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ ఖాతాలో నిధుల మళ్లింపునకు సంబంధించి రూ. 238 కోట్లమేర అవకతవకలు జరిగినట్లు పీఎస్‌యూ సంస్థ పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ పేర్కొంది. ఫలితంగా ఈ కౌంటర్‌లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం..

టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్‌
ఈ ఏడాది మార్చిలో దహేజ్‌ ఔషధ తయారీ ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఓఏఐను ప్రకటించినట్లు దేశీ హెల్త్‌కేర్‌ సంస్థ టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ పేర్కొంది. తద్వారా జారీ చేసిన ఫామ్‌ 483కు అనుగుణంగా ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది. ఈ విషయాన్ని  యూఎస్‌ఎఫ్‌డీఏకు నివేదించినప్పటికీ ఓఏఐ జారీ కావడం గమనార్హం. ఈ అంశంపైనా తగిన చర్యలు సైతం చేపట్టనున్నట్లు టొరంట్‌ వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టొరంట్‌ ఫార్మా షేరు దాదాపు 4 శాతం పతనమైంది. రూ. 1527 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1485 వరకూ దిగజారింది. 

Image result for punjab sind bank

పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌
భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ నిధుల మళ్లింపు ఆరోపణలపై వెలువడిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికలో భాగంగా రూ. 238 కోట్లమేర మోసం జరిగినట్లు పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్ తాజాగా రిజర్వ్‌ బ్యాంకుకు నివేదించింది. అయితే బ్యాంకింగ్‌ నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే రూ. 189 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ షేరు 4 శాతం పతనమైంది. రూ. 25 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 24 వరకూ నీరసించింది.