మార్కెట్లను ముంచెత్తనున్న కొత్త వాహనాలు

మార్కెట్లను ముంచెత్తనున్న కొత్త వాహనాలు

ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద సంఖ్యలో కొత్త మోడళ్ళను మార్కెట్లోకి విడుదల చేసేందుకు వాహన కంపెనీలు రెడీ అయ్యాయి. పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా, సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌ పోటీని తట్టుకునేందుకు వాహన కంపెనీలు కసరత్తులు పూర్తి చేశాయి. దీంతో వచ్చే ఏడాది మార్చి చివరినాటికి దాదాపు 30 కొత్త కార్లు, 20 ద్విచక్ర వాహనాలు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. 

గత కొన్ని నెలలుగా ప్యాసింజర్‌ వెహికిల్స్‌తో పాటు ద్విచక్రవాహన అమ్మకాలు మందగించాయి. గత ఏడాదితో పోలిస్తే జూన్‌లో ద్విచక్ర వాహనాలు 5శాతం, ప్యాసింజర్‌ వెహికిల్స్‌ 4.6 శాతం అమ్మకాలు క్షీణించాయి. వినియోగదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో వాహన కంపెనీలు వారిని ఆకట్టుకోవడానికి సరికొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. దీంతో వాహన కంపెనీలు కొత్త కార్ల తయారీపై దృష్టిపెట్టాయి.లగ్జరీ కార్లు కాకుండా కొత్త వాహనాల తయారీ కోసం రూ.1,500-2,000 కోట్లను వాహన కంపెనీలు ఇన్వెస్ట్‌ చేయడంతో వచ్చే ఫెస్టివల్‌ సీజన్‌లో పెద్ద సంఖ్యలో వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి. అలాగే వచ్చే మార్చినాటికి ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ వెహికిల్స్‌తో పాటు ఇతర వాహనాలు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. 

కొత్త మోడళ్ళు ఇవే..
మారుతీ సుజుకీ : ఎర్తిగా క్రాస్‌, ఎస్‌-ప్రెస్పో
హ్యూండాయ్‌ : న్యూ గ్రాండ్‌ ఐ10, టస్కన్‌ ఫెస్ట్‌లిఫ్ట్‌, న్యూ ఎలైట్‌ ఐ20
హోండా : HR-V, న్యూ గ్రాండ్‌ సిటీ,
టాటా : బజార్డ్‌, ఆట్రోజెడ్‌
స్కోడా : కరోఖ్‌
రెనాల్ట్‌ : రెనాల్ట్‌ ట్రైబర్‌, క్విడ్‌ ఫేస్‌లిఫ్ట్‌

కేర్‌ రేటింగ్స్‌ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ వాహన అమ్మకాలు నెమ్మదించే ఛాన్స్‌ ఉంది. ఫెస్టివల్‌ సీజన్‌ ప్రారంభం కానుండటంతో మూడో త్రైమాసికంలో ఆటో సేల్స్‌ మెరుగ్గా ఉండే ఛాన్స్‌ ఉందని కేర్‌ రేటింగ్స్‌ అంచనా వేస్తోంది.