క్యూ1- విప్రో.. జూమ్‌

క్యూ1- విప్రో.. జూమ్‌

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌.. బుధవారం మార్కెట్లు ముగిశాక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. దీంతో నేటి ట్రేడింగ్‌లో ఈ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో విప్రో షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 268 వద్ద ట్రేడవుతోంది. వివరాలు చూద్దాం..

క్యూ1 ఇలా
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో విప్రో లిమిటెడ్‌ రూ. 2388 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2018-19) క్యూ1తో పొలిస్తే ఇది 12.5 శాతం అధికంకాగా.. ఐటీ సర్వీసుల ఆదాయం 5.3 శాతం పుంజుకుని రూ. 14,716 కోట్లను తాకింది. డాలర్లలో 4.3 శాతం ఎగసి 203.9 కోట్లకు చేరింది. క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 2 శాతం వరకూ పెరిగే వీలున్నట్లు అంచనా వేసింది. 203.9-208 కోట్ల డాలర్ల మధ్య నమోదుకావచ్చని భావిస్తోంది. కాగా.. క్యూ1లో త్రైమాసిక ప్రాతిపదికన నికర లాభం 3.8 శాతం క్షీణించగా.. మొత్తం ఆదాయం 2 శాతం వెనకడుగు వేసింది. క్యూ1లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 5 శాతం వార్షిక వృద్ధితో రూ. 15,567 కోట్లుగా నమోదైంది. 

ఐటీ మార్జిన్లు ఓకే
క్యూ1లో ఐటీ సర్వీసుల మార్జిన్లు 18.4 శాతంగా నమోదుకాగా.. నికర లాభాల్లో 98 శాతంపైగా ఫ్రీ క్యాష్‌ ఫ్లోను సాధించినట్లు విప్రో లిమిటెడ్‌ తెలియజేసింది. క్లయింట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా క్యూ1లో 10 కోట్ల డాలర్ల విభాగంలో ముగ్గురు కస్టమర్లను కొత్తగా పొందినట్లు వెల్లడించింది.