కేర్‌.. క్యార్ క్యార్‌- హెచ్‌డీఎఫ్‌సీ భళా

కేర్‌.. క్యార్ క్యార్‌- హెచ్‌డీఎఫ్‌సీ భళా

రేటింగ్ సంస్థ కేర్‌(CARE) లిమిటెడ్‌.. కంపెనీ ఎండీ, సీఈవోను సెలవుపై పంపినట్లు తెలియజేయడంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ఈ షేరు నష్టాలతో కళతప్పింది. కాగా.. మరోవైపు వరుసగా మూడో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కౌంటర్‌ మరోసారి సరికొత్త రికార్డును సాధించింది. వివరాలు చూద్దాం..

కేర్‌ రేటింగ్స్‌ లిమిటెడ్‌
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఫిర్యాదు దాఖలైన నేపథ్యంలో కంపెనీ ఎండీ, సీఈవో రాజేష్‌ మొకాషీను సెలవుపై పంపినట్లు కేర్‌ రేటింగ్స్‌ లిమిటెడ్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. తద్వారా రాజేష్‌పై సెబీ వద్ద దాఖలైన ఫిర్యాదు పరిశీలనకు కంపెనీ బోర్డు వీలు కల్పించినట్లు కేర్‌ తెలియజేసింది. ప్రస్తుతం రేటింగ్స్‌ విభాగం ఈడీ టీఎన్‌ అరుణ్‌ కుమార్‌ మధ్యంతర సీఈవోగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో కేర్‌ రేటింగ్స్‌ షేరు 4.4 శాతం పతనమై రూ. 868 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 861 వరకూ దిగజారింది. 

Image result for hdfc asset management

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) షేరు వరుసగా మూడో రోజు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 2139 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2147 వరకూ జంప్‌చేసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం గమనార్హం! ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో  హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నికర లాభం 42 శాతం ఎగసి రూ. 292 కోట్లను తాకింది. ఇందుకు వ్యయాలు కట్టడికావడం, ఇతర ఆదాయం మెరుగుపడటం దోహదం చేశాయి. కాగా.. మొత్తం ఆదాయం 7 శాతం పెరిగి రూ. 504 కోట్లకు చేరింది. ఫీజు, కమిషన్‌ వ్యయాలు రూ. 84 కోట్ల నుంచి రూ. 11 కోట్లకు క్షీణించినట్లు కంపెనీ తెలియజేసింది. ఏఎంసీ బిజినెస్‌ నిర్వహణ లాభం 44 శాతం జంప్‌చేసి రూ. 381 కోట్లను తాకింది.