మైండ్‌ట్రీ పతనం- సుదర్శన్‌ జోష్‌

మైండ్‌ట్రీ పతనం- సుదర్శన్‌ జోష్‌

సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. డైవర్సిఫైడ్‌ ఇంజినీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ ..కంపెనీ పగ్గాలు చేపట్టాక తొలిసారి మైండ్‌ట్రీ ఫలితాలు ప్రకటించింది. ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ను నాన్‌ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మైండ్‌ట్రీ లిమిటెడ్‌ బోర్డు నియమించింది. కాగా.. క్యూ1 పనితీరు నిరాశపరచడంతో మైండ్‌ట్రీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా..  మరోపక్క స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ సుదర్శన్‌ కెమికల్స్‌ కౌంటర్‌ నష్టాల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. సుదర్శన్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ అమన్సా హోల్డింగ్స్‌ వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడం దీనికి కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం..

మైండ్‌ట్రీ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో మైండ్‌ట్రీ లిమిటెడ్‌ నికర లాభం త్రైమాసిక ప్రాతిపదికన 53 శాతంపైగా క్షీణించి రూ. 93 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం సైతం 31 శాతం తక్కువగా రూ. 193 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం యథాతథంగా రూ. 1834 కోట్లుగా నమోదైంది. డాలర్ల ఆదాయం నామమాత్ర వృద్ధితో 26.42 కోట్లను తాకింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మైండ్‌ట్రీ లిమిటెడ్‌ షేరు 5 శాతం పతనమై రూ. 713 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 11 శాతం కుప్పకూలింది. రూ. 671 వద్ద ఏడాదిన్నర కనిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2018 ఫిబ్రవరిలో మాత్రమే మైండ్‌ట్రీ షేరు ఈ స్థాయిలో ట్రేడయ్యింది.

Image result for sudarshan chemicals

సుదర్శన్‌ కెమికల్స్‌
కంపెనీలో ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ అమన్సా హోల్డింగ్స్‌ ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడికావడంతో సుదర్శన్‌ కెమికల్స్‌ షేరు జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 333 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 337 వరకూ ఎగసింది. సుదర్శన్‌ కెమికల్స్‌లో 1.39 శాతం వాటాకు సమానమైన 9.63 లక్షల షేర్లను అమన్సా హోల్డింగ్స్‌ సొంతం చేసుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా పేర్కొంది.