మూడోసారీ లాభాలే- ఆటో స్కిడ్‌

మూడోసారీ లాభాలే- ఆటో స్కిడ్‌

కొద్ది రోజులుగా కనిపిస్తున్న ట్రెండ్‌ ప్రకారం దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమై చివరికి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 85 పాయింట్లు పుంజుకుని 39,216 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 25 పాయింట్లు బలపడి 11,688 వద్ద స్థిరపడింది. తద్వారా వరుసగా మూడో రోజు మార్కెట్లు సానుకూలంగా ముగిసినట్లయ్యింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌150 పాయింట్ల వరకూ ఎగసింది. 39,285 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. కాగా.. వరుసగా నాలుగు రోజులపాటు సరికొత్త గరిష్టాలను అందుకుంటూ వచ్చిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం డీలాపడ్డాయి. చైనాతో వాణిజ్య వివాద పరిష్కారాలు సుదూరంలో ఉన్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించడంతో నాలుగు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది. ఇక మరోపక్క ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగిశాయి.

బ్యాంక్స్‌ ప్లస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఐటీ రంగాలు 1-0.6 శాతం మధ్య పెరిగాయి. ఆటో 1 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌, జీ, యూపీఎల్‌, హిందాల్కో, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బ్రిటానియా 3-2 శాతం మధ్య ఎగశాయి. అయితే యస్‌ బ్యాంక్‌ 5 శాతం పతనంకాగా, ఐషర్‌, గెయిల్‌, మారుతీ, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, టాటా మోటార్స్‌, ఎయిర్‌టెల్‌ 3-1 శాతం మధ్య క్షీణించాయి. 

దివాన్‌ దూకుడు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో దివాన్‌ హౌసింగ్‌ 11 శాతం దూసుకెళ్లగా.. ఈక్విటాస్‌, ఎంసీఎక్స్‌, రిలయన్స్ కేపిటల్‌, బీవోబీ, కాల్గేట్‌ పామోలివ్‌, ఉజ్జీవన్‌, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఐసీఐసీఐ ప్రు 5.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు టాటా ఎలక్సీ 9 శాతం కుప్పకూలగా.. స్ట్రైడ్స్‌ ఫార్మా, కజారియా, ఫెడరల్‌ బ్యాంక్‌, అరవింద్‌, మణప్పురం, ఎస్‌ఆర్‌ఎఫ్‌ 3.5-2.2 శాతం మధ్య క్షీణించాయి. 

మిడ్‌ క్యాప్‌ వీక్‌
మార్కెట్లు లాభాలతో ముగిసినప్పటికీ మధ్య, చిన్నతరహా షేర్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.15 శాతం బలహీనపడింది. ట్రేడైన షేర్లలో 1124 లాభపడగా.. 1356 నష్టాలతో ముగిశాయి.  

దేశీ ఫండ్స్‌ దన్ను
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 445 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 638 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. ఎఫ్‌పీఐలు సోమవారం రూ. 216 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు దాదాపు రూ. 592 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.