హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి క్యూ1 కిక్‌

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి క్యూ1 కిక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) కౌంటర్‌ వరుసగా రెండో రోజు వెలుగులోకి నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు సరికొత్త గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 2077 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపు రూ. 1990తో పోలిస్తే తొలుత ఒక దశలో 7 శాతం దూసుకెళ్లింది. రూ. 2127 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఆకర్షణీయ ఫలితాల కారణంగా మంగళవారం సైతం ఈ షేరు 3 శాతం ఎగసి రూ. 1990 వద్ద స్థిరపడిన విషయం విదితమే. వెరసి రెండు రోజుల్లో 10 శాతం లాభపడింది. ఈ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం సైతం 3 రెట్లు ఎగసింది. ఉదయం సెషన్‌లోనే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో కలిపి 10 లక్షలకుపైగా షేర్లు ట్రేడ్‌కావడం గమనార్హం! ఇతర వివరాలు చూద్దాం..

42 శాతం వృద్ధితో..
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రయివేట్‌ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నికర లాభం 42 శాతం ఎగసి రూ. 292 కోట్లను తాకింది. ఇందుకు వ్యయాలు కట్టడికావడం, ఇతర ఆదాయం మెరుగుపడటం దోహదం చేశాయి. కాగా.. మొత్తం ఆదాయం 7 శాతం పెరిగి రూ. 504 కోట్లకు చేరింది. ఫీజు, కమిషన్‌ వ్యయాలు రూ. 84 కోట్ల నుంచి రూ. 11 కోట్లకు క్షీణించినట్లు కంపెనీ తెలియజేసింది. ఏఎంసీ బిజినెస్‌ నిర్వహణ లాభం 44 శాతం జంప్‌చేసి రూ. 381 కోట్లను తాకింది.

ఏయూఎం జోరు
జూన్‌కల్లా కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 18 శాతం పుంజుకుని రూ. 3.57 ట్రిలియన్లను తాకినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ వెల్లడించింది. వీటిలో ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌, ఇండెక్స్‌ ఫండ్స్‌ను మినహాయిస్తే ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌ ఏయూఎం రూ. 1.69 ట్రిలియన్లకు చేరినట్లు వివరించింది. తద్వారా 16.2 శాతం మార్కెట్‌ వాటాను సాధించినట్లు తెలియజేసింది. కాగా.. ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి గతంలో ఇచ్చిన బయ్‌ రేటింగ్‌ను గ్లోబల్‌ బ్రోకింగ్ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. టార్గెట్‌ ధరను రూ. 1850 నుంచి రూ. 2200కు పెంచింది.